: దంత వైద్యులకు ఉపకరించే త్రీడీ స్కానరు
మన దంతాలను గురించి తెలుసుకోవడానికి దంత వైద్యులు దంత మూసలను ఉపయోగించేవారు. అయితే ఇకపై అలాంటి అవసరం లేకుండానే రోగుల దంతాలను గురించి చక్కగా తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం ఒక సరికొత్త పరికరం రూపంలో తయారైంది. ఈ పరికరంతో రోగి నోటిలోని దంతాలను గురించి చక్కగా, కచ్చితంగా తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక త్రీ డీ స్కానర్‌ను తయారు చేశారు. ఈ స్కానర్ రోగి నోటిలోపలి భాగాన్ని డిజిటల్ చిత్రాల్లో బంధిస్తుంది. దీంతో డెంటిస్టులు దంత మూసలను ఉపయోగించాల్సిన అవసరం లేకుండా ఈ సరికొత్త పరికరాన్ని ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చేతితో పట్టుకుని ఉపయోగించగలిగే ఈ త్రీ డీ స్కానర్‌తో నోటి లోపలి దంతాల పరిస్థితి కచ్చితంగా తెలుస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరికరాన్ని 'లావా చైర్‌సైడ్ ఓరల్ స్కానర్ (లావాసీఓఎస్)'గా వ్యవహరిస్తున్నారు. ఈ పరికరాన్ని ఇప్పటికే వేలాదిమంది దంత వైద్యులకు విక్రయించినట్టు పరిశోధకులు చెబుతున్నారు.