: ఆంటోనీని కలవనున్న టాలీవుడ్ ప్రతినిధులు
రాష్ట్ర విభజన ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ భవితవ్యంపై అనిశ్చతి నెలకొంది. రాష్ట్రం రెండు ముక్కలైతే చిత్ర పరిశ్రమ పయనం ఎటు? హైదరాబాదు లోనే మనుగడ సాగిస్తుందా? లేక, వైజాగ్ తరలిపోతుందా? అన్న సందేహాలు సామాన్యుడి నుంచి నిర్మాతల వరకు అందరినీ వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు టాలీవుడ్ ఫిలిం మేకర్స్ రెండ్రోజుల్లో ఏకే ఆంటోనీని కలిసి తమ అభిప్రాయాలను, ప్రతిపాదనలను వెల్లడించనున్నారు.
నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతుండడంతో.. సీమాంధ్రలో భారీ ఫిలిం సిటీ నిర్మించి ఇవ్వాలని వారు ప్రధానంగా విజ్ఞప్తి చేయనున్నారు. ముంబయి, చెన్నై తరహాలో ప్రభుత్వ అజమాయిషీలో ఉండే భారీ స్టూడియోను స్థాపిస్తే, పరిశ్రమ తాజా ఇన్నింగ్స్ మొదలుపెడుతుందని కొందరు నిర్మాతలు అంటున్నారు. కాగా, టాలీవుడ్ ప్రతినిధుల బృందాన్ని కలిసేందుకు ఆంటోనీ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. సమగ్రమైన బ్లూప్రింట్ తో వస్తే పరిశీలిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.