: సమైక్యం కోసం పాటుపడిన ఇందిరను విమర్శించడం తప్పు: ఎంపీ అనంత
టీడీపీ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. లోక్ సభలో సస్పెండైన అనంతరం ఆయన పార్లమెంటు ఆవరణలో మాట్లాడుతూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తీవ్రంగా పోరాడుతున్నామని అన్నారు. కేవలం 2014 ఎన్నికలే ధ్యేయంగా టీడీపీ అవాకులు చవాకులు పేలుతోందని మండిపడ్డారు. తమ పార్టీ నేతలంతా అధిష్ఠానంపై పోరాడుతుంటే, టీడీపీ మాత్రం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపేందుకు ఉబలాటపడుతోందని ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చివరి వరకూ పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.
అప్పట్లో ప్రతిపక్షాలన్నీ వేర్పాటు వాదానికి అనుకూలంగా లేఖలు ఇచ్చినందువల్లే ఇప్పుడు రాష్ట్రానికి ఈ దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ఏం చెప్పారో ప్రతిపక్షాలు గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడడంతో పాటు, ప్రజాఉద్యమంలో కూడా తాము పాల్గొంటామని ఎంపీ అనంత తెలిపారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ పలువురి వేషాల్లో వచ్చి అలరించినా సమైక్యత కోసం పాటుపడిన ఇందిరాగాంధీ వేషంలో రావడాన్ని అనంత తప్పుపట్టారు. ఆయన హుందాగా వ్యవహరించడం నేర్చుకోవాలని హితవు పలికారు.