: పెట్రోధరల పెంపుపై మండిపడుతున్న విపక్షాలు


ధరలు పెంచుతూ కేంద్ర చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. రూపాయి పతనాన్ని అడ్డుకోకుండా ప్రజలనెత్తిన భారమెయ్యడాన్ని పలు పార్టీల నేతలు తీవ్రంగా దుయ్యబట్టారు. మూడు నెలల్లో ఆరు సార్లు పెట్రోఉత్పత్తులపై ధరలను పెంచడం అంటే సగటు జీవిని భారతదేశంలో జీవించొద్దని సందేశమిస్తున్నారా? అని బీజేపీ నేతలు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణం ధరలను ఉపసంహరించుకోవాలని, అవసరమైతే పెట్రోభారాన్ని ప్రభుత్వమే భరించాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత డిమాండ్ చేశారు. యూపీఏ ముసుగులో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడిందని, అందుకే తలాతోక లేని నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని తృణముల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ నేత మమతాబెనర్జీ ఆరోపించారు. పెట్రోలు ధరలను మూడు నెలల్లో ఆరుసార్లు పెంచారని, ఇదెక్కడి న్యాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు యూపీఏ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 5,6 తేదీలలో జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు చేపడతామని రాఘవులు స్పష్టం చేశారు. తక్షణం చమురు సంస్థలు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రం ఒత్తిడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో యూపీఏ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాఘవులు హెచ్చరించారు.

  • Loading...

More Telugu News