: ఆమె బిడ్డకు ప్రియుడే తండ్రి!
పాశ్చాత్య దేశాల సంస్కృతిని భారతీయ యువత బాగానే ఒంటబట్టించుకుంటున్నారు. భోజన అలవాట్లు, సంప్రదాయాలు... ఒకటేమిటీ, అన్నింట్లోనూ కొత్త పోకడలకు పోతున్నారు. తాజాగా సహజీవనం వెర్రితలలు వేస్తోంది. నమ్మకం కలగడం లేదా? అయితే ఇది చదవండి. ఓపక్క ప్రియుడితో సహజీవనం చేస్తూ, మరోపక్క మాజీ భర్తతో లైంగిక సంబంధం కలిగిన మహిళ నెల తప్పింది. దీంతో తన గర్భానికి కారణం ఎవరు? ఆ బిడ్డకి ఎవర్ని తండ్రిగా పరిచయం చేయాలి? అనే సందేహం ఆ మహిళను వేధించింది. దీంతో డీఎన్ఏ పరీక్ష ద్వారా ఆ బిడ్డకి తండ్రి ప్రియుడేనని తెలుసుకుని, అతనితోనే కాపురం చేయాలని నిశ్చయించుకుందా పడతి.
ఉత్తరాదికి చెందిన ఓ మహిళ బెంగళూరులో టెకీగా పని చేస్తోంది. సహోద్యోగిని పదేళ్ల క్రితమే పెళ్లాడింది. అయినా పిల్లలు లేకపోవడంతో వారు రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. తాజాగా అదే కంపెనీలో మరో సహోద్యోగితో సఖ్యత కుదిరి అతనితో సహజీవనం చేస్తోంది. అయినప్పటికీ మాజీ భర్తతో లైంగిక బంధాన్ని మాత్రం వీడలేదు. ఈ క్రమంలో ఆమె 4 నెలల క్రితం గర్భందాల్చింది. అయితే ఇక్కడే ఆమెకో ధర్మసందేహం కలిగింది. పుట్టబోయే బిడ్డకు అసలు తండ్రెవరు? అని.
అంతే ప్రియుడు, మాజీ భర్తను వెంటబెట్టుకుని ఆమె ఓ ప్రముఖ ఆసుపత్రికి వెళ్లింది. తొలుత 'నో' చెప్పిన వైద్యులు అరుదైన కేసు కావడంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, ప్రియుడే బిడ్డకు తండ్రి అని తేల్చారు. అయితే ప్రియుడు, మాజీ భర్త కూడా ఆమెతో కాపురం చేయడానికి పచ్చజెండా ఊపినా ఆమె మాత్రం ప్రియుడికే ఓటేసింది.