: ఆకాశానికి, నేలకు అనుసంధానమైది
'అంబికా దర్బార్ బత్తి' భగవంతునికి- భక్తునికి నిజంగా అనుసంధానమైనది అవునో కాదో గానీ.. ఈ అగరుబత్తీ మాత్రం అచ్చంగా ఆకాశానికి, నేలకు అనుసంధానమైనదనే చెప్పుకోవాలి. రికార్డుల్లోకి ఎక్కాలనే ఓ చిలిపి ఉద్దేశంతో కొందరు స్నేహితులు కలిసి రూపొందించిన ఈ అగరుబత్తీ పొడవు ఎంతో తెలుసా... అక్షరాలా 31 అడుగులు, 76 సెంటీమీటర్లు. అంటే సుమారు మీటరు వ్యాసంతో ఉంటుంది. నాగ్ చంపా వాసనలు వెదజల్లేలా దీనిని రూపొందించారట.
గిన్నిస్ రికార్డు కొట్టే ఉద్దేశంతో ప్లాన్ చేసిన ఈ అగరుబత్తీ రూపకల్పనకు 13 రోజులు పట్టిందని తయారీదారుల్లో ఒకరైన అష్రితా ఫర్మన్ చెబుతున్నారు. తయారు చేసిన వారంతా కలిసి దీనిని తమ యోగా గురువు 82 ఏళ్ల చిన్మయ్‌కి అంకితం ఇచ్చేశారట. అంతవరకు బాగానే ఉంది గానీ.. ఈ అగరుబత్తీ పరిమళాలను ఆఘ్రాణించి.. ఆస్వాదించాలంటే.. సదరు గురువుగారు నాలుగో అంతస్తు వరకు ఎక్కి కూర్చోవాల్సిందేగా పాపం!