: పిల్లులందు బొచ్చు పిల్లులు వేరు
పిల్లులను పెంచుకోవడానికి కొందరు ఆసక్తి చూపిస్తారు. మరికొందరు పిల్లులను తాకడానికి కూడా ఇష్టపడరు. అయితే ఒక పిల్లి అందరినీ ఆకర్షించేసింది. ఎందుకంటే, ఇది మామూలు పిల్లి లాంటిది కాదు కాబట్టి. దీని ఆకారమే అందరినీ తనవైపుకు ఆకర్షించేలా చేస్తోంది. దీంతో దీన్ని గురించి రాసేందుకు గిన్నిస్ బుక్ వారు కూడా ముందుకు వచ్చారు మరి!
లాస్‌ఏంజిల్స్ లో ఒక పిల్లి ఉంది. దానిపేరు కలొనెల్ మ్యూ. పేరు భలే వెరైటీగా ఉందికదూ. దీని ఆకారం కూడా కాస్త వెరైటీగానే ఉంటుంది. ఎందుకంటే, దీని ఒంటిపైన పొడవైన బొచ్చుతో చూడడానికి బొచ్చుకుక్కపిల్లలా ఉంటుంది. దీని శరీరంపైన బొచ్చు ఎంత పొడవు అంటే 9 అంగుళాల పొడవుంది. దీంతో అత్యంత పొడవైన బొచ్చు ఉన్న పిల్లిగా దీని పేరును గిన్నిస్ బుక్‌లోకి ఎక్కించేశారు అధికారులు. అంతేకాదు దీని పేరుతో వెబ్‌సైట్, ఫేస్‌బుక్‌లో పేజీ, యూట్యూబ్‌లో ఛానెల్‌కూడా ఇది సంపాదించేసింది మరి. కాబట్టి పిల్లే అని తేలిగ్గా చూడకండి మరి!