: యాసిన్ భత్కల్ అరెస్ట్ వ్యవహారం.. ఆద్యంతం సీక్రెట్
ఇండియన్ ముజాహిదీన్ ఛీఫ్ యాసిన్ భత్కల్ అరెస్ట్ వ్యవహారం ఆద్యంతం గోప్యంగానే కొనసాగింది. ఈ విషయాన్ని బీహార్ పోలీస్ బాస్ అభయానంద్ ధ్రువీకరించారు. పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, భత్కల్ ను అరెస్ట్ చేసిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు ఈ విషయాన్ని టాప్ సీక్రెట్ గా ఉంచామని చెప్పారు. అంతేకాకుండా, ప్రస్తుతం భత్కల్ ను విచారి్స్తున్న ప్రాంతం కూడా కేవలం కొందరు బీహార్ పోలీస్ ఉన్నతాధికారులకు మాత్రమే తెలుసని ఆయన తెలిపారు. భద్రత కారణాల వల్ల ఈ వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని తెలిపారు.
ఉన్నతాధికారులతో కూడిన ఒక టీం భత్కల్ ను విచారిస్తోందని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా జరిగిన బాంబు పేలుళ్లలో యాసిన్ భత్కలే కీలక సూత్రధారని ఆయన అన్నారు. యాసిన్ భత్కల్ అరెస్టు వ్యవహారంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలకు సహాయం చేసింది కూడా బీహార్ పోలీసులేనని ఆయన తెలిపారు.
యాసిన్ భత్కల్ ను బుధవారం రాత్రి ఇండో-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి సంఘటనలూ తలెత్తకుండా ఉండేందుకు... శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా బీహార్ సరిహద్దు జిల్లాలను అప్రమత్తం చేశామని ఆయన ప్రకటించారు. అంతే కాకుండా నిఘా వ్యవస్థను అప్రమత్తం చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలను ఆదేశించినట్టు ఆయన తెలిపారు. త్వరలోనే భత్కల్ ను ఢిల్లీకి తరలిస్తామని... అంత వరకు అతడిని ఇక్కడే విచారిస్తామని మరో పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
ఇండో-నేపాల్ బోర్డర్ లో భత్కల్ ను అరెస్ట్ చేసినప్పుడు... మొదట తాను నేపాల్ లో ఒక ప్రాజెక్టులో ఇంజినీర్ గా పనిచేస్తున్నట్టు చెప్పి తప్పించుకోవాలని చూసినట్టు తెలుస్తోంది. పోలీసులు నమ్మకపోవడంతో మాట మార్చి, తానొక యునానీ వైద్యుడినని... ఇస్లామిక్ వైద్య విధానంలో వ్యాధులను నయం చేస్తానని చెప్పినట్టు సమాచారం.