: ముగిసిన నాలుగో రోజు ఆట.. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న ఆసీస్
చెన్నై టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ఓటమి ప్రమాదం తప్పించుకుంది. టెయిలెండర్లు పోరాటపటిమ కనబర్చడంతో ఆసీస్.. భారత్ పై 40 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్కోరు 232/9 కాగా.. చేతిలో ఒక్క వికెట్ మాత్రమే ఉండడం, ఆటకు మరో రోజు మిగిలే ఉండడంతో ఆసీస్ కు ఈ టెస్టులో పరాజయం ఖాయంగానే కనిపిస్తోంది.
192 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ ను నాలుగో రోజు ఆటలో భారత స్పిన్నర్లు హడలెత్తించారు. అశ్విన్ మరోసారి ఐదు వికెట్లు తీసి కంగారూ బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. అయితే ఆల్ రౌండర్ హెన్రిక్స్ (75 బ్యాటింగ్) భారత బౌలింగ్ కు అడ్డుగోడలా నిలిచాడు. క్రీజులో హెన్రిక్స్ జతగా లియాన్ (8 బ్యాటింగ్) ఉన్నాడు.
అంతకుముందు ఓవర్ నైట్ స్కోరు 515/8తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా 572 పరుగులకు ఆలౌటైంది. ధోనీ 224 పరుగులకు అవుటయ్యాడు. ఆసీస్ పేసర్ ప్యాటిన్సన్ 5 వికెట్లు తీశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 380 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో 224 పరుగులు చేసిన ధోనీ అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత కెప్టెన్ గా ఘనత నమోదు చేశాడు. ఈ క్రమంలో మహీ.. సచిన్ ను వెనక్కినెట్టాడు. కెప్టెన్ హోదాలో సచిన్ 1999లో కివీస్ పై 217 పరుగులు చేశాడు.