: రూపాయికి రిజర్వ్ బ్యాంకు 'మాత్ర'
ఆసుపత్రి బెడ్ మీద పడుకున్న రూపాయికి రిజర్వ్ బ్యాంకు 'మాత్ర' కొద్దిగా పనిచేసింది. డాలర్లకు అంతులేని డిమాండ్ కారణంగానే రూపాయి విలువ భారీగా పతనమవుతూ వస్తోంది. చమురు దిగుమతుల కోసం ఆయిల్ కంపెనీలకు ఎన్నో డాలర్లు కావాల్సి ఉంటుంది. సిరియాపై అమెరికా సైనిక దాడికి దిగబోతుందనే వార్తలతో చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్నాయి. దీనివల్ల దిగుమతుల కోసం మరిన్ని డాలర్ల అవసరం ఏర్పడింది. ఇది రూపాయిని మరింత అస్వస్థతకు గురిచేస్తోంది.
దీనిని గుర్తించిన రిజర్వ్ బ్యాంకు ప్రభుత్వ రంగంలోని మూడు ఆయిల్ కంపెనీలకు అవసరమైన మేరకు డాలర్లు సరఫరా చేయడానికి వీలుగా ప్రత్యేకంగా ఒక విండోను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆయిల్ కంపెనీలకు నెలకు 850 కోట్ల డాలర్ల అవసరం ఉంటుంది. రోజువారీ డాలర్ల అవసరాలను ఈ విండో తీరుస్తుంది. దీనివల్ల ఫారెక్స్ మార్కెట్లో రూపాయిపై ఒత్తిడి తగ్గుతుందని రిజర్వ్ బ్యాంకు యోచన. ఈ ప్రభావంతో ఈరోజు రూపాయి 150 పైసల వరకూ కోలుకుంది.