: రోజూ పెరుగుతింటే మేలేనట


మీరు మీ భోజనంలో రోజూ పెరుగును చేర్చుకోండి. ఇది మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. పెరుగుతోగానీ సాధారణంగా భోజనం పూర్తికాదు. చాలామంది భోజనం చివర్లో పెరుగన్నం తింటే అప్పుడు వారి భోజనం సంపూర్ణమయినట్టుగా భావిస్తారు. అయితే కొందరికి పెరుగంటే పడదు. దీనికి కారణాలెలావున్నా... ఆహారంలో పెరుగును చేర్చుకోవడం మాత్రం అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

పెరుగు రుచికేకాదు... ఇందులో మన ఆరోగ్యానికి మేలు చేసే సుగుణాలు చాలానే ఉన్నాయట. పెరుగులో అధిక మొత్తంలో లభించే కాల్షియం మన ఎముకల్ని దృఢంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రోజూ పెరుగు తినేవారిలో ఆస్టియో పోరోసిస్‌ వచ్చే అవకాశాలు కూడా తక్కువని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఒక పరిశోధన వ్యాసంలో రాశారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్‌ శరీరంలో తెల్ల రక్తకణాలను పెంచుతాయి. దీంతో సహజంగానే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని అమెరికాకు చెందిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పెరుగులో విటమిన్‌ బి12, రైబోఫ్లేవిన్‌, ఫాస్పరస్‌ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ కూడా శరీర జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి. విటమిన్‌ బి12 శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచి, నరాల వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫాస్పరస్‌ పళ్లను, ఎముకలను బలంగా ఉంచుతుంది. ఇక ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్ధాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రీమెనుస్ట్రువల్‌ సిండ్రోమ్‌తో బాధపడేవారికి ఈ సమస్యను తగ్గించడంలో పెరుగులో ఉండే మెగ్నీషియం చక్కగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. మరి ఇన్ని ఉపయోగాలున్న పెరుగును ప్రతిరోజూ మన ఆహారపు మెనూలో చేర్చుకుని ఆరోగ్యంగా ఉందాం.

  • Loading...

More Telugu News