: అందరూ అభిమన్యులేనట!


మహాభారతంలో అభిమన్యుడు తల్లి గర్భంలో ఉండగానే పద్మవ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని తండ్రి ద్వారా విన్నాడు. తర్వాత కాలంలో సంభవించిన మహాభారత సంగ్రామంలో పద్మవ్యూహంలోకి ప్రవేశించి బలయ్యాడు. అయితే ఇలా తల్లిగర్భంలోనుండే వినడం అనేది ఒక్క అభిమన్యుడే చేశాడా... అంటే కాదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. గర్భంలో ఉండే ప్రతి బిడ్డా ఇలా తాను విన్న విషయాలను పుట్టిన తర్వాత గుర్తుపెట్టుకుని ఆ విషయాలను, పదాలను సులభంగా నేర్చుకుంటుందని శాస్త్రవేత్తలు తాము నిర్వహించిన పరిశోధనల ద్వారా ఋజువు చేస్తున్నారు.

ఫిన్లాండ్‌కు చెందిన హెల్సింకి విశ్వవిద్యాలయం పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తల్లి గర్భంలోనుండే శిశువు తరచూ బయట వినిపించే పదాలను చక్కగా వినడమే కాకుండా వాటిని గుర్తుంచుకుంటారని కూడా శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న మెదడుతో శిశువు ఈ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిల్లల్లో భాషాపరమైన అభివృద్ధి అనేది పుట్టిన తర్వాత కాకుండా తల్లి గర్భంలోనుండే మొదలవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రొఫెసర్‌ మిన్నా హౌటిలేనెన్‌ సారధ్యంలో జరిగిన ఈ అధ్యయనంలో భాగంగా 29 వారాల గర్భంతో ఉన్న సుమారు 33 మంది మహిళల్ని తీసుకుని వారిలో సగం మందికి ప్రతిరోజూ కొన్నిసార్లు టాటాటా అనే పదాన్ని రకరకాల యాసల్లో వినిపించారు. ప్రసవం అయిన తర్వాత పిల్లల వద్ద ఈ పదం రికార్డును వినిపించి, ఆ సమయంలో వారి మెదడులో జరిగే మార్పులను స్కానింగ్‌ ద్వారా పరిశీలించారు.

ఈ పరిశోధనలో తేలిన విషయమేమంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ పదాన్ని అనేకమార్లు విన్న పిల్లలందరిలోనూ పుట్టిన తర్వాత అదే పదాన్ని విన్నప్పుడు వారి మెదడులో స్పందనలు పెరిగాయి. అంతేకాదు... టాటాటాను వేర్వేరు యాసల్లో వినిపించినప్పటికీ ఈ స్పందనలు కనిపించాయి. ఈ పదాన్ని వినని పిల్లల్లో మాత్రం ఎలాంటి స్పందనలు కనిపించలేదు. ఈ ఫలితాలను గురించి ప్రొఫెసర్‌ మిన్నా హౌటిటేనెన్‌ విశ్లేషిస్తూ మీ గర్భంలో ఉన్న మీ చిన్నారి మీ మాటలను వింటోదన్న విషయాన్ని మీరు గుర్తించండి. తనతో మీరు సంభాషణ ప్రారంభించండి అంటూ కాబోయే తల్లిదండ్రులకు సలహాలనిస్తున్నారు.

  • Loading...

More Telugu News