: దీనికి స్పీడు మరీ ఎక్కువ!
వేగానికి సంబంధించి... చెప్పాల్సి వస్తే వాషింగ్ మెషిన్, దంతవైద్యులు ఉపయోగించే డ్రిల్లర్ చాలా వేగంగా తిరిగే వస్తువులుగా చెప్పవచ్చు. అయితే వీటన్నింటికన్నా కూడా అత్యధిక వేగంగా తిరిగే వస్తువులు ఏవైనా ఉన్నాయా... అంటే కొద్దిరోజుల వరకూ లేదనే చెప్పవచ్చు. కానీ ఇప్పుడు వాటన్నింటికన్నా కూడా అత్యంత వేగంగా తిరిగే వస్తువును శాస్త్రవేత్తలు తయారు చేశారు.
సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒక కొత్త వస్తువును తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా గింగిర్లు (స్పిన్) కొట్టగల వస్తువుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకూ మనిషి నిర్మించిన వస్తువుల్లో ఈ వస్తువే అత్యధిక భ్రమణ వేగం ఉన్న వస్తువుగా శాస్త్రవేత్తలు తెలిపారు. కాల్షియం కార్బొనేట్‌తో రూపొందించిన ఈ అతిసూక్ష్మ వస్తువు వ్యాసం ఒక మీటరులో 40 లక్షల వంతు మాత్రమే ఉంటుంది. ఈ వస్తువును పూర్తిగా శూన్యంలో పెట్టి లేజర్ కాంతి వత్తిడికి లోనుచేసి, భ్రమణంలో ఉంచారు. ఈ వస్తువు మామూలు వాషింగ్ మెషిన్ కంటే ఐదు లక్షల రెట్లు, దంతవైద్యులు ఉపయోగించే డ్రిల్లర్ కంటే వెయ్యిరెట్లు వేగంగాను ఇది తిరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.