: మరో టైటానిక్ తయారుకానుంది
ఒకప్పటి టైటానిక్ నౌక గుర్తుందా... దీన్ని ఎవరూ కనులారా చూడకున్నా... అందరికీ దీని పేరు మాత్రం సుపరిచితం. ఈ నౌక మునిగిపోయిన విషాదం గురించి టైటానిక్ సినిమా పుణ్యమా అని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు మరో టైటానిక్ రూపుదిద్దుకోనుంది. ఈ పేరు మహిమో ఏమో మరి, ఈ నౌక రూపకల్పనకు సంబంధించిన ప్రాజెక్టుకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతంగా స్పందన వచ్చిందట. ఈ పేరుతో ఉన్న నౌకలో ప్రయాణించాలని ప్రపంచవ్యాప్తంగా టైటానిక్ అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారట.
ఆష్ట్రేలియా కుబేరుడుగా పేరుగాంచిన క్టెవ్ పామర్ ఒక కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేయ తలపెట్టాడు. దీనిపేరు టైటానిక్. ఇది తాను నిర్మించితలపెట్టిన ఒక నౌక పేరు. ఈ నౌకలో యాత్ర చేయడానికి దరఖాస్తు చేసుకునేందుకు చాలామందే పోటీ పడ్డారట. ఈ విషయాన్ని పామర్ తెలిపారు. వచ్చే ఏడాది మార్చిలో టైటానిక్ నౌకకు సంబంధించిన నిర్మాణపు పనులు చైనాలో మొదలవుతాయని ఆయన తెలిపారు. భూవిక్రయం, గనుల వ్యాపారం ద్వారా కుబేరుడుగా ఎదిగిన పామర్ ఈ ఏడాది ప్రారంభంలో ఒక పార్టీని కూడా స్థాపించారు. ఆష్ట్రేలియాలో సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. కాగా పామర్ నిర్మించనున్న ఈ టైటానిక్ నౌకలో మొదటిసారిగా ప్రయాణించడానికి వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, ఈ నౌకా యాత్ర 2016లో మొదలయ్యే అవకాశం ఉందని పామర్ చెబుతున్నారు. ఈ నౌక పేరు ఒకప్పటి ప్రేమకు, సాహసానికి సంబంధించినదిగా ప్రజల్లో టైటానిక్ చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. కాబట్టే అంతటి స్పందన వస్తోందని పామర్ అంటున్నారు.