: మా సభను అడ్డుకుంటే తెలంగాణ వాదనలో బలం లేనట్టే: ఏపీఎన్జీవో
హైదరాబాదులో తాము వచ్చే నెల 7న సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సభ నిర్వహిస్తామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఆ సభను అడ్డుకుంటే తెలంగాణ వాదనలో బలం లేదని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదులో సభను నిర్వహించి తీరుతామని ధీమాగా చెప్పారు. తాము సభ జరిపితే తెలంగాణ వాదం దెబ్బతింటుందన్న వాదన సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. గత రెండ్రోజులుగా ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తున్న ఏపీఎన్జీవో నేతలు ఈ ఉదయం బీజేపీ అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్ లను కలిసిన సంగతి తెలిసిందే. అద్వానీ కాంగ్రెస్ ది తొందరపాటు చర్య అని వ్యాఖ్యానించారని, ఏ ప్రాంతానికి నష్టం జరగకూడదని ఆకాంక్షించారని అశోక్ తెలిపారు. ఇక సెప్టెంబర్ 2 నుంచి విద్యుత్ రంగ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటున్నారని, అప్పుడు ఉద్యమం తీవ్రతరం అవుతుందని ఆయన పేర్కొన్నారు.