: మూడేళ్లలో 14 మంది విద్యార్థినులపై వార్డెన్ అత్యాచారం
జన్మనిచ్చిన తండ్రి, రక్తం పంచుకుపుట్టిన సోదరుడు, విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువులు ఆడపిల్లలపై అత్యాచారాలు చేయడం ఇటీవలి కాలంలో పెరిగిపోతుండడం అత్యంత ఆందోళనకరం. సంస్కృతిలోనూ, విలువల్లోనూ, బంధాల్లోనూ, నడతలోనూ భారతీయలు ప్రపంచానికి ఆదర్శనీయులు. కానీ, ప్రస్తుతం దేశంలో జరుగుతున్న దారుణాలను చూస్తుంటే.. భారతీయత అస్థిత్వమే ప్రమాదంలో పడినట్లు కనిపిస్తోంది. దేశం ఎటు వెళుతోంది? అన్న ఆవేదన వేధిస్తోంది.
సంరక్షణాధికారిగా ఉండాల్సిన వాడు విద్యార్థినులపై కన్నేసి.. మూడేళ్లలో 14 మంది బాలికలపై లైంగిక అకృత్యాలు చేశాడు. అరుణాచల్ ప్రదేశ్ లోని పశ్చిమ సియాంగ్ జిల్లా లికాబలిలో ఈ దారుణం జరిగింది. ప్రైవేటు స్కూలు హాస్టల్ వార్డెన్ 4 ఏళ్ల నుంచి 13 ఏళ్లలోపు బాలికలను బెదిరిస్తూ 14 మందిపై అత్యాచారం చేశాడు. గత మూడేళ్లుగా ఇది సాగుతోంది.
దీనిపై కొందరు బాధిత విద్యార్థినులు ప్రిన్సిపల్ కు నిన్న తెలియజేశారు. అయితే, ఆ వ్యవహారాన్ని ఆయన అక్కడే సమాధి చేయాలని చూశాడు. కానీ, కొందరు విద్యార్థినులు ధైర్యం చేసి హాస్టల్ నుంచి తప్పించుకుని లికాబలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కామ గురువు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల ఆందోళనతో పోలీసులు నిందితుడు విపిన్ విశ్వాన్ ను అరెస్ట్ చేశారు.