: దేశానికి రూపాయి శాపం


దేశ ప్రజలకు రూపాయి శాపంగా మారుతోంది. కనీవినీ ఎరుగని రీతిలో కరెన్సీ విలువ హరించుకుపోతోంది. అంతర్జాతీయంగా భారత విలువను పలుచన చేస్తోంది. ఈ రోజు ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 68 స్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ అక్కడితో ఆగిపోలేదు. 68.75కు దిగజారింది. నిన్నటి ముగింపు 66.24 తో చూస్తే ఒకే రోజు రూపాయి ఏ స్థాయిలో పతనమైందో అర్థమవుతోంది. రూపాయి పాపమా అని ఇప్పటికే అంతర్జాతీయ ధరలతో సంబంధం లేకుండా బంగారం దేశీయంగా కొండెక్కింది. డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు కూడా వచ్చే 10 రోజుల్లో భగ్గుమనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఎందుకుంటే మారకం విలువ ఈ స్థాయిలో పతనం అయిందంటే చమురు ఉత్పత్తుల దిగుమతులపై ఖర్చు భారీగా పెరిగిపోతుంది. ధరలు పెంచకుంటే అది ఆయిల్ కంపెనీలకు తలకుమించిన భారం కాగలదు. బంగారం ధరలను మార్కెట్ నిర్ణయిస్తుంది గనుక రూపాయి పతనమైన వెంటనే 10 గ్రాముల ధర రెండు వేల రూపాయలకు పైగా పెరిగిపోయింది. కానీ చమురు ఉత్పత్తుల ధరలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడంతో రాత్రికి రాత్రికి పెంచడానికి అవకాశం లేదు. వీటి ధరలు పెరిగితే అన్ని రవాణా చార్జీలు భారమై, అన్ని నిత్యావసరాల ధరలు సామాన్యుడికి మంటలు పుట్టించడం ఖాయం. ఇప్పటికే అక్టోబర్ 1 నుంచి రైల్వే రవాణా చార్జీలను పెంచుతామని మంత్రి ఆదిర్ రంజన్ చౌదరి నిన్న చెప్పారు. దీనివల్ల బొగ్గు, ఇనుము సహా చాలా సరుకుల రవాణా వ్యయం అధికమవుతుంది.

అప్పుడు ద్రవ్యోల్బణం పగ్గాలు తెంచుకుంటుంది. దీనికి ముకుతాడు వేయడం కోసం రిజర్వ్ బ్యాంకు మార్కెట్లో ద్రవ్య సరఫరా తగ్గించే చర్యలను అనుసరిస్తే వడ్డీ రేట్లు పెరిగి, రుణాల లభ్యత తగ్గుతుంది. దీనివల్ల పారిశ్రామిక వేత్తలకు రుణభారం పెరిగి, రుణాల లభ్యత తగ్గుతుంది. అన్ని కలిసి ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తాయి. ఎఫ్ఐఐలు తమ నిధులను వెనక్కి లాగేసుకుంటారు. స్టాక్ మార్కెట్ల కాళ్లు విరుగుతాయి. వృద్ధి రేటు చతికిలపడుతుంది. ఉద్యోగావకాశాలు అడుగంటుతాయి. ఆకలి మంటలు ఎగుస్తాయి. అప్పుడు ఆహార భద్రత బిల్లు అక్కరకు వస్తుందేమో!

  • Loading...

More Telugu News