: బాలీవుడ్ లో గేల్ గానం
మంచినీళ్ళు తాగినంత అలవోకగా బంతిని స్టాండ్స్ లోకి పంపే బ్యాటింగ్ వీరుల్లో క్రిస్ గేల్ మొదటి వరుసలో నిలుస్తాడు. అమేయ భుజబలం, చురుకైన చూపులు, నిండైన విగ్రహం.. ఇవే కాకుండా, మరికొన్ని ఎక్స్ ట్రా యాక్టివిటీస్ కూడా మనోడి వద్ద ఉన్నాయండోయ్. డ్యాన్సింగ్, సింగింగ్ వాటిలో ప్రముఖమైనవి. దక్షిణకొరియా పాప్ స్టార్ సై కి భారత ఉపఖండంలో ప్రాచుర్యం లభించిందంటే అది గేల్ వల్లే. శ్రీలంకలో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా గేల్ .. సై హిట్ సాంగ్ 'గాంగ్నమ్ స్టయిల్' లోని డ్యాన్సులు చేస్తూ ఆ గీతాన్ని అందరికీ పరిచయం చేశాడు.
తాజాగా.. ఈ కరీబియన్ విధ్వంసకారి ఓ బాలీవుడ్ రీమిక్స్ గీతాన్ని ఆలపించనున్నాడు. అంతేగాకుండా ఆ మ్యూజిక్ వీడియోలో కూడా కనిపిస్తాడట. 1995లో ఏఆర్ రహ్మాన్ స్వరపరిచిన హమ్మ హమ్మ హమ్మా (బొంబాయి) పాటను బాలీవుడ్ నటుడు, వీజే పూరబ్ కోహ్లీ రీమిక్స్ చేయాలని నిర్ణయించాడు. ఆ పాటకు గేల్ కూడా గొంతు కలపనున్నాడు.