: శుక్రుడిపైకి తెరచాప రోవర్
అంగారకుడిపైన ఉన్న వాతావరణం తదితర వివరాలను తెలుసుకోవడానికి రోవర్ అనే రోబోను అమెరికా అంతరిక్షయాన సంస్థ నాసా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ రోవర్ అంగారక గ్రహానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేసింది. ఇప్పుడు మరో గ్రహానికి సంబంధించిన సమాచారాన్ని కనుగొనాలని నాసా ప్రయత్నాలు ప్రారంభించింది. శుక్ర గ్రహంపై ఎలాంటి వాతావరణం ఉంది, ఇంకా ఆ గ్రహానికి సంబంధించిన ఇతర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఒక కొత్త తరహా రోవర్‌ను శుక్ర గ్రహంపైకి పంపడానికి నాసా సన్నాహాలు ప్రారంభించింది.
సాధారణంగా సముద్రాలు, నదులపైన మనం తెరచాపలతో నడిచే పడవలను ఉపయోగిస్తాం. ఈ తెరచాపలు గాలుల ఆధారంగా పడవను ముందుకు సాగిపోయేలా చేస్తాయి. అయితే ఇప్పుడు ఇలా తెరచాప ఆధారంగా నడిచేలా ఒక కొత్త తరహా రోబోటిక్ రోబోను తయారుచేసి, దాన్ని శుక్రగ్రహంపై పరిశోధనలకు పంపాలని నాసా ఆలోచిస్తోంది. ఈ రోవర్ ఆ గ్రహంలోని తీవ్రస్థాయి గాలుల వేగాన్ని, అసాధారణ ఉష్ణోగ్రతలను ఉపయోగించుకుని ముందుకు సాగుతుంది. శుక్ర గ్రహం ఉపరితలానికి ఎగువున గాలిలో తేలియాడుతూ నడిచే ఈ రోవర్‌పేరు జెఫిక్.