: క్షణికావేశంతో కన్నబిడ్డకు నిప్పంటించిన తల్లి
చిన్న కలహాలు ఎంత పెద్ద పొరపాట్లు చేయిస్తాయో, క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలు ఎంత తీవ్ర ప్రభావం చూపుతాయో తెలిపే ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. టి.నరసాపురం మండలం వీరభద్రవరం గ్రామానికి చెందిన తాటి వీరబాబు, వెంకటేశ్వరమ్మ భార్యాభర్తలు. వాళ్లకు శశి కుమార్(8) ఒక్కడే సంతానం. కొద్ది కాలం క్రితం వెంకటేశ్వరమ్మ కుటుంబ అవసరాల నిమిత్తం బంగారం తాకట్టు పెట్టింది. ఈ సాయంత్రం ఆ బంగారం విడిపించమని తన భర్తను కోరింది. ప్రస్తుతానికి డబ్బులు లేవని తరువాత విడిపిద్దామని ఆయన తన భార్యకు చెప్పాడు.
ఆర్ధిక ఇబ్బందులతో విసుగు చెందిన ఆమె తనువు చాలిద్దామని అనుకుంది. తాను తనువు చాలిస్తే తన కుమారుడు దిక్కు లేని వాడైపోతాడని భావించిన వెంకటేశ్వరమ్మ తనతో పాటు శశి కుమార్ పై కూడా కిరోసిన్ పోసి నిప్పంటించింది. మంట వేడిమి తాళలేని వెంకటేశ్వరమ్మ తన చీరను విప్పేసింది. అంతలో విషయం గమనించిన వీరబాబు భార్యను కాపాడాడు. కానీ ఆ సరికే శశి కుమార్ 90 శాతం కాలిపోయాడు. దీంతో ఆ బాలుడిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఏలూరు కేంద్ర ఆసుపత్రికి రిఫర్ చేశారు. బాలుడి పరిస్థితి విషమంగా ఉందని అతని శరీరం పూర్తిగా కాలిపోయిందని వైద్యులు తెలిపారు.