: ఉద్యమ సందట్లో దోచుకున్నోడికి దోచుకున్నంత!
రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే కాంక్షతో సీమాంధ్ర జిల్లాల్లో రెండు వారాలుగా నిరవధిక బంద్ లు, సమ్మెలు కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర రాజధానికి రావడం 'గగన'మైపోయింది. ఆర్టీసీ కార్మికులు కూడా నిరవధిక సమ్మెలో పాల్గొనడంతో రవాణా నిలిచిపోయింది. ప్రైవేటు ట్రావెల్స్ వారు ధైర్యం చేసి పరిమితంగా బస్సులు నడుపుతున్నారు. విశాఖ, కోస్తా జిల్లాల నుంచి హైదరాబాద్ కు తీసుకు వచ్చేందుకు ట్రావెల్స్ వారు సాధారణ రోజుల్లో వసూలు చేసే చార్జీ కంటే రెట్టింపు, రెండు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. దీంతో అత్యవసరమైతే తప్ప ఆయా ప్రాంతాల వారు ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇటు రాయలసీమ జిల్లాలలోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ రోజు నుంచి ట్రావెల్స్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో బస్సులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దాడుల కారణంగానే వారీ నిర్ణయం తీసుకున్నారు.
విమానయాన సంస్థలు కూడా సీమాంధ్ర బంద్ ను భలే క్యాష్ చేసుకుంటున్నాయి. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు సాధారణ రోజుల్లో చార్జీ 4 వేల రూపాయల వరకే ఉండేది. కానీ ఆదివారం ఒక్కో ప్రయాణికుడి నుంచి 12వేల రూపాయల వరకు వసూలు చేశారు. తిరుపతి నుంచి హైదరాబాద్ కు 9వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో చార్జీ 2,600 రూపాయలే. ఇక ఆటోవాలాలు కూడా మామూలు చార్జీల కంటే రెండింతలు వసూలు చేస్తున్నారు. ఉల్లిపాయలు, పప్పులు, ఇతర సరుకుల ధరలకు కూడా రెక్కలు వచ్చాయి. బంద్ ఎంతో మందికి కాసులు కురిపిస్తోంది.