: టీవీలు, స్మార్ట్ ఫోన్ల పుణ్యం... భాష దూరం
ఒకప్పుడు చిన్న పిల్లలు తమ బామ్మలు, లేదా తాతయ్యల ఒడిలో కూర్చుని వారితో ఎంచక్కా మాట్లాడేవారు. వారు చెప్పే కథలను వింటూ తమకు వచ్చిన సందేహాలను అడిగి తీర్చుకుంటుండేవారు. అయితే ఈ విధానంలో వారికి తెలియకుండానే చిన్న పిల్లల్లో భాషా పరమైన అభివృద్ధి జరుగుతుండేది. అయితే కాలం మారుతోంది. క్రమేపీ పెద్ద కుటుంబాలు కాస్తా కుచించుకుపోతున్నాయి. పిల్లలతో మాట్లాడేవారు కరవైపోయారు. దీంతో వారు టీవీలకు, కంప్యూటర్ గేములకు పరిమితం అయిపోయారు. ఫలితంగా వారిలో భాషా సామర్ధ్యం కొరవడుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
పిల్లలకు పెద్దవారితో సంబంధాలు క్రమేపీ తగ్గుతున్నాయని, గత ఐదేళ్ల కాలంతో పోల్చితే చిన్న పిల్లల్లో భాషా పరమైన సమస్యలు, ఇబ్బందులు, మాట్లాడడానికి సంబంధించిన సమస్యలు పెరిగాయని తాజాగా నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. దీనికి కారణం టీవీ, స్మార్ట్ ఫోన్లు వాడకం, సెల్‌ఫోన్ వాడకం పెరగడమేనని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా టీవీలు, కంప్యూటర్ వంటి స్క్రీన్ బేస్డ్ టెక్నాలజీ పెరగడం వల్ల పిల్లలకు పెద్దలతో ఉండే సంబంధాలు తగ్గిపోతున్నాయని, సదరు పరికరాలు తల్లిదండ్రుల పాలిట బేబీ సిట్టర్లుగా మారుతున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
రోజంతా తల్లిదండ్రులు తమ తమ ఉద్యోగ విధుల్లో మునిగితేలడం వల్ల పిల్లలకు చేరువగా కూర్చుని వారికి ఇష్టమైన కథలు, పద్యాలు చెప్పేవారు కరువయ్యారు. దీంతో పిల్లల్లో భాషా పరమైన సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిలోని సభ్యులంతా కలిసి భోజనం చేసేలా సమయాన్ని కేటాయించుకున్నాకూడా పిల్లల్లో ఇలాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు.