: సినీ జోస్యం చెబుతారట!


మీరు సినిమా తీసేవారా... అయితే మీ సినిమా హిట్టా...? ఫట్టా...? అనేది మేం ఇట్టే చెప్పేస్తాం అంటున్నారు లండన్‌కు చెందిన పరిశోధకులు. దీనికి సంబంధించి కొన్ని సినిమాల విషయంలో తాము గతంలో చెప్పిన జోస్యం కరెక్టయింది అని కూడా చెబుతున్నారు. కొన్ని సినిమాల్లో వీరి జోస్యం అంచనాలు తప్పింది కానీ కొన్ని కరెక్టయ్యాయట. దీంతో ఏ సినిమా అయినా హిట్టా? ఫట్టా? అని లెక్కలేసి చెప్పేస్తామంటున్నారు లండన్‌కు చెందిన పరిశోధకులు.

లండన్‌కు చెందిన కొందరు పరిశోధకులు కొన్ని గణిత నమూనాలను రూపొందించారు. ఈ నమూనాలతో ఎలాంటి సినిమా అయినా హిట్టా? ఫట్టా? అని లెక్కలేసి చెప్పేస్తామంటున్నారు. తాము గతంలో ఐరన్‌మ్యాన్‌ 2, అలైస్‌ ఇన్‌ వండర్‌ ల్యాండ్‌, టాయ్‌ స్టోరీ3, ఇన్‌సెప్షన్‌ వంటి సినిమాలు విజయాలు సాధిస్తాయని చెప్పామని, అవి చక్కటి విజయాలు సాధించాయని చెప్పారు. అయితే నెవర్‌ లెట్‌మీ గో, యానిమల్‌ కింగ్‌డమ్‌ సినిమాల వసూళ్ల విషయంలో వీరి అంచనాలు కొద్దిగా తప్పాయి. తాము రూపొందించిన గణిత నమూనాల ప్రకారం సినిమాల బాక్సాఫీసు వసూళ్లను గురించి 77 శాతం సరిగ్గా చెప్పగలిగామని వారు చెబుతున్నారు.

ఇప్పటివరకూ 312 చిత్రాల్లో ఆరింటి గురించి 99 శాతం సరిగ్గా చెప్పగలిగారు. 23 చిత్రాలకు 90 శాతం, మరో 70 చిత్రాలకు 70 శాతం జాతకాన్ని ముందుగానే ఊహించి వీరు చెప్పగలిగారు. ఈ జోస్యం గురించి వివిధ చిత్రాలకు సంబంధించి విడుదలైన వీకెండ్‌ రెవెన్యూ, గణిత నమూనాలను పోల్చి చూస్తే తాము ఊహించిన ఫలితాలు దగ్గరగానే వచ్చాయని పరిశోధకులు తెలిపారు. 312 చిత్రాలకు సంబంధించిన వికీపీడియాల్లో ఆర్టికల్స్‌ ఎంతమంది చూశారు? వాటిపై ఎందరు వ్యాఖ్యలు చేశారు? నెటిజన్లు ఇంటర్నెట్‌లో సినిమా గురించి మార్పులు, చేర్పులు చేయడం వంటి వివిధ అంశాలను పరిశీలించి వారు ఫలితాలను అంచనా వేశారు.

ఈ విషయాలను గురించి యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ ఫర్డ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ ఇంటర్నెట్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన డాక్టర్‌ తహ యాస్సెరి మాట్లాడుతూ, మార్కెటింగ్‌ విభాగాలకు ఈ ఫలితాలు ఎంత ఉపయోగకరంగా ఉంటాయో అంతకన్నా ఎక్కువ మాకు ముఖ్యమని, భవిష్యత్తులో మానవ ప్రవర్తనను అంచనా వేయడానికి అంతర్జాల డాటాను ఎలా వినియోగించుకున్నాం అనేది వివరంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు.

  • Loading...

More Telugu News