: మైక్రోసాఫ్ట్ సీఈవో రేసులో హైదరాబాదీ
ప్రపంచంలోనే అతి పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) స్టీవ్ బామర్ వచ్చే ఏడాది ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. ఆ తరువాత ఈ బాధ్యతలు చేపట్టేందుకు పలువురు సిద్దమవుతున్నారు. సీఈవో పదవికి ఎవరు సరైన వ్యక్తి? అని తేల్చేందుకు మైక్రోసాఫ్ట్ ఓ కమిటీని కూడా వేసింది. ఈ కమిటీకి జాన్ ధాంప్సన్ అధ్యక్షత వహిస్తున్నారు. కాగా మైక్రోసాఫ్ట్ సీఈవో పదవిని అధిష్టించేందుకు పలువురు రేసులో ఉన్నారు. వారిలో సత్య నాదెళ్ల కూడా ఒకరు. ఈయన హైదరాబాద్ వాసి కావడం విశేషం. మంగుళూరు యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పట్టభద్రుడైన సత్య నాదెళ్ల, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, యూనివర్సిటీ ఆఫ్ షికాగోల్లో ఉన్నత విద్యనభ్యసించారు. చాలా కాలంగా మైక్రోసాఫ్ట్ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం క్లౌడ్, ఎంటర్ ప్రైజెస్ విభాగం బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ రేసులో సత్య నాదెళ్లతో పాటు, వి గుండోత్ర, కెవిన్ టర్నర్, టోనీ బేల్స్, పాల్ మార్టిజ్ కూడా ఉన్నారు.