: జర్నలిస్టుపై అత్యాచారం కేసులో మరో నిందితుడు అరెస్ట్
ముంబైలో ఫొటో జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఐదుగురు నిందితులలో ఇద్దరు దొరికినట్లయింది. మరో ముగ్గురి కోసం 20 పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. వీరికి సంబంధించిన ఊహా చిత్రాలను కూడా పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
గురువారం రాత్రి విధుల్లో భాగంగా సహచర ఉద్యోగితో కలిసి 23 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్టు పారెల్ ప్రాంతానికి వెళ్లగా అక్కడ శక్తి మిల్స్ ప్రాంతంలో ఐదుగురు ఆమెపై అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అడ్డుకోబోయిన సహచర ఉద్యోగిపై వారు దాడి చేశారు. దీనిపై ముంబైతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు రావడంతో పోలీసులు కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జర్నలిస్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ పరామర్శించారు.