: ఈ పాపం ఎవరిది?
నవమాసాలు మోసి ... తను కన్న బిడ్డను గుండెలకు హత్తుకుని పురిటి నొప్పులు మరిచిపోతుంది ఏ తల్లి అయినా. కానీ, ఓ తల్లి మాత్రం అప్పుడే తన పేగు తెంచుకుని పుట్టిన పసికూనను పెంటకుప్పపాలు చేసి, 'అమ్మ' స్థానానికి అన్యాయం చేసింది. ఆడబిడ్డగా పుట్టడమే ఆ పసికందు చేసిన పాపమా... అన్న సందేహాలకు ఈ ఘటన సాక్షీభూతంగా నిలుస్తోంది. మానవత్వానికే మాయని మచ్చగా నిలిచింది.
ఆ వివరాల్లోకి వెళితే, మనిషన్న ప్రతి ఒక్కర్నీ కలచివేసే ఈ ఘటన మన రాష్ట్ర రాజధాని నడిబొడ్డున చోటుచేసుకుంది. సికింద్రాబాద్ కార్ఖానాలోని వాసవీనగర్ కమ్యూనిటీ హాలు ఎదుట ఉన్న చెత్తకుండీలో చెత్తను తరలించేందుకు వచ్చిన పారిశుద్ధ్య సిబ్బందికి ఓ ప్లాస్టిక్ కవర్ కనిపించింది. అందులోంచి చిన్నగా మూలుగు లాంటి శబ్దం వినపడడంతో కవర్ తెరిచి చూసిన సిబ్బంది అవాక్కయ్యారు. ఆ ప్లాస్టిక్ కవర్ లో అప్పుడే పుట్టిన ఆడ శిశువు ఉండటం చూసి ఆశ్చర్యంతో స్థానికులకు సమాచారమిచ్చారు. ముందుగా పాప చనిపోయిందనుకున్న స్థానికులు, ఆ పసికందులో కదలికలు కనిపించడంతో వెంటనే వైద్యులకు చూపించారు. మెరుగైన వైద్యం కోసం పాపను నిలోఫర్ ఆసుపత్రి కి తరలించారు.