: కోచ్ గా అవతారం ఎత్తనున్న అజారుద్దీన్
చాలా ఏళ్ల తర్వాత అజారుద్దీన్ మళ్లీ క్రికెట్ కు సేవలు అందించనున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన అజారుద్దీన్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. తాజాగా ఆయన జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టుకు కొత్త కోచ్ గా నియమితులు కానున్నారు. ఈ బాధ్యతలు స్వీకరించడానికి ఆయన అంగీకరించినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఈ మేరకు అజహర్ ను ఒప్పించారు. అయితే, రాజకీయ పరమైన బాధ్యతలు ఉన్నందున పూర్తి స్థాయి కోచ్ గా కాకుండా పరిమిత సేవలను అజహర్ అందించనున్నారు. అజహర్ జమ్మూ కాశ్మీర్ జట్టుకు కొత్త కోచ్ అని ఫరూక్ అబ్దుల్లా నిన్న ప్రకటించారు. ఆయన తన ఆఫర్ ను అంగీకరించారని, తమ రాష్ట్ర కుర్రాళ్లకు అజహర్ తర్ఫీదునిస్తారని తెలిపారు.