: అమ్మతో గొడవపడి.. సరిహద్దులు దాటి అరెస్టయ్యాడు!
ఎక్కడ మధ్యప్రదేశ్... ఎక్కడ పాకిస్థాన్! కానీ అమ్మ మీద కోపంతో ఒక 15 ఏళ్ల బాలుడికి దూరం తెలియలేదు. చివరికి దేశ సరిహద్దులు దాటి పాక్ భద్రతా దళాలకు చిక్కాడు. మధ్యప్రదేశ్ కు చెందిన జితేందర్ అర్జున్ వార్ అమ్మతో గొడవ పడ్డాడు. రెండు నెలల కిందట ఇది జరిగింది. కోపంతో అమ్మపై అలిగి ఇల్లు వదిలి బయటకు వచ్చాడు. నడక ప్రారంభించాడు.
ఎటు వెళుతున్నాడో తెలియదు. ఆ నడక అలా సాగిపోయింది. రెండు రోజుల కిందట అతడికి ఒక ముళ్ల కంచె అడ్డొచ్చింది. పశువులు రాకుండా ఏర్పాటు చేసి ఉంటారని భావించాడు. ఎలాగోలా ఆ తీగలను దాటేశాడు. దూరంగా లైట్ వెలుగుతూ కనిపిస్తుంటే అక్కడకు చేరుకున్నాడు. చూస్తే పదుల సంఖ్యలో మిలటరీ యూనీఫాం ధరించి ఆయుధాలు ధరించిన వారు ఉన్నారు. కానీ, తాను పాకిస్థాన్ లోని సింధు ప్రాంతంలో ఖోఖ్రాపూర్ చెక్ పోస్టుకు చేరుకున్నానని అతడికి అర్థం కాలేదు. అధికారులు అతడి వివరాలు తెలుసుకుని అక్కడి హైదరాబాద్ పట్టణంలోని బాలల జైలుకు పంపించారు.