: దీనివల్లే పిల్లలు పుట్టడంలేదట


కొందరు దంపతులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్నా పిల్లలు పుట్టరు. కనిపించిన దేవుళ్లకంతా మొక్కులు మొక్కుకుంటారు. అయినా పిల్లలు కలగరు. ఇలాంటి వారి ఆశను ఆసరాగా చేసుకొని కొందరు వైద్యులమని చెప్పుకునేవారు వారిని పిల్లలు కలిగేలా చేస్తామని మోసం చేస్తుంటారు. అసలు ఇలా కొందరు దంపతులకు పిల్లలు కలుగకపోవడానికి కారణం ఏంటనే విషయాన్ని శాస్త్రవేత్తలు పసిగట్టేశారు. పురుషుల్లో వంద్యత్వానికి కారణమయ్యే జన్యువును శాస్త్రవేత్తలు గుర్తించేశారు. ఈ జన్యువును ముందుగానే గుర్తించేస్తే ఇలా అందరి చుట్టూ తిరిగే బదులు చక్కగా ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానాన్ని పొందే విధానంపై దంపతులు దృష్టి సారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం, వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలు రొమ్ము, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కణాల్లో హార్మోన్‌ చర్యపై ప్రభావం చూపే ఒక జన్యువుకు పురుష వంధ్యత్వంలో పాత్ర ఉన్నట్టు గుర్తించారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో శాస్త్రవేత్తలు ఎస్‌ఎల్‌ఐఆర్‌పీ అనే జన్యువుపై దృష్టిసారించారు. ఈ జన్యువు లేని ఎలుకలకు మిగిలినవాటితో పోలిస్తే మూడోవంతు మేర తక్కువ సంతానం ఉన్నట్టు శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఆ తర్వాత మానవుల్లో ఈ జన్యువు ప్రభావంపై కూడా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. ఎస్‌ఎల్‌ఐఆర్‌పీ పరిమాణం తక్కువగా ఉంటే వంధ్యత్వం తలెత్తుతున్నట్టుగా ఈ పరిశోధనల్లో తేలింది. ఈ జన్యువు స్థాయి తక్కువగా ఉన్నట్టుగా ముందుగానే తెలిస్తే దంపతులు సహజసిద్ధ గర్భధారణ అంశాన్ని పక్కనపెట్టి ఐవీఎఫ్‌ విధానం ద్వారా సంతానాన్ని పొందే విషయంపై దృష్టి సారించొచ్చని పీటర్‌ లీడ్‌మన్‌ అనే శాస్త్రవేత్త చెబుతున్నారు.

  • Loading...

More Telugu News