: సల్మాన్ కేసు విచారణ వాయిదా
ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న వారిపై నుంచి కారు పోనిచ్చి ఒకరి మరణానికి కారణమయ్యారని అభియోగాలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కేసు విచారణ వాయిదా పడింది. సల్మాన్ పై దోషపూరిత హత్యానేరం అభియోగాలను ప్రాసిక్యూషన్ మోపిన సంగతి తెలిసిందే. కాగా, ఈకేసుపై విచారణ జరుపుతున్న ముంబయి సెషన్స్ కోర్టు తాజాగా విచారణను సెప్టెంబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. 2002 సెప్టెంబర్ 28న తెల్లవారుజామున మద్యం మత్తులో ఉన్న సల్మాన్ ఖాన్ తన ల్యాండ్ క్రూయిజర్ వాహనంలో వేగంగా ప్రయాణిస్తూ ఫుట్ పాత్ పైకి పోనివ్వడంతో ఒకరు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో 17 మంది సాక్షులను విచారించిన కోర్టు సల్మాన్ పై తీవ్ర అభియోగాలు మోపింది. ఈ కేసులో దోషిగా నిరూపితమైతే సల్మాన్ కు పదేళ్ళు జైలు శిక్ష పడే అవకాశముంది.