: సీఎంని కలిసిన వెంటనే ఏపీఎన్జీవోలు మాట మార్చారు: కేటీఆర్
రాష్ట్ర విభజన నిర్ణయం ప్రకటించిన అనంతరం తాము హక్కుల కోసం పోరాడుతున్నామన్న ఏపీఎన్జీవోలు.. సీఎం కిరణ్ ను క్యాంపు కార్యాలయంలో కలిసిన వెంటనే మాట మార్చారని కేటీఆర్ ఆరోపించారు. అప్పటినుంచి సమైక్యాంధ్ర కావాలంటూ వారు భిన్న గళం వినిపించసాగారని ఆయన విమర్శించారు. హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన సద్భావన దీక్షలో మాట్లాడుతూ, వీరి వైఖరి చూస్తుంటే ఏపీఎన్జీవోలకు సీఎం కిరణ్ చైర్మన్ లా వ్యవహరిస్తున్నట్టుందని అన్నారు. ఇంతకుముందు హుస్నాబాద్ లో జరిగిన సభలో సీఎం ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారన్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. మీడియా సమావేశంలో సీఎం మాట్లాడిన అడ్డగోలు మాటలపై ఆ మరుసటి రోజు కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అంశాలవారీగా తూర్పారబట్టారని తెలిపారు.
కిరణ్, లగడపాటి, రాయపాటి, కావూరి, మేకపాటి వంటి నేతలు తమ స్వీయ మానసిక ఆందోళనలను ప్రజలపై రుద్దుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. తమ ఆందోళనను ప్రజల ఆందోళనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు దక్కనిది ఎవరికీ దక్కకూడదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆంధ్రా పార్టీలన్నీ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటూ ఒక్కటవుతున్నాయని ధ్వజమెత్తారు.