: అవకాశం ఉంటే స్వజాతి వైపే స్త్రీజాతి మొగ్గు
ఎంపిక చేసుకునే అవకాశం ఉంటే వేరే జాతి కాకుండా స్వజాతివైపే ఆడ జీవులు మొగ్గుచూపుతాయట. సహజంగా ప్రకృతిలో పశుపక్ష్యాదులు, జలచరాలకు చెందిన స్త్రీ జీవులు తమ స్వజాతికి చెందిన వారసులనే ఎలా తయారు చేసుకోగలుగుతున్నాయి... ఈ విషయంపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. ఇతర జాతికి చెందిన మగజీవులతో కలిసినా కూడా స్త్రీ జీవులు వాటి వారసత్వం రాకుండా ఎలా అడ్డుకోగలుగుతున్నాయనే విషయంపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు ఎంపిక చేసుకునే అవకాశం వస్తే మాత్రం తమ జాతికి చెందిన జీవులనే ఎంపిక చేసుకుంటాయని గుర్తించారు.
అమెరికాలోని ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పశుపక్ష్యాదులు, జలచరాలు వంటి జీవుల్లో స్త్రీజాతి తమ స్వజాతికి చెందిన వారసులనే ఎలా తయారు చేసుకోగలుగుతున్నాయి? అనే విషయంపై పరిశోధనలు సాగించారు. ఇందుకోసం వీరు సాల్మన్, ట్రాట్ జాతికి చెందిన చేపలను ఎంచుకున్నారు. ఈ రెండు రకాల చేపలు దాదాపుగా ఒకే లక్షణాలను కలిగివుంటాయి. ఈ రెండు వేర్వేరు జాతికి చెందినా సంతానాభివృద్ధికోసం బాహ్య ఫలదీకరణ పద్ధతిని ఎంచుకుంటాయి. స్త్రీచేప తన అండాలను బయటికి వదులుతుంది. ఈ అండాలు వాటికి తగ్గ వీర్యం దొరికినప్పుడే అవి ఫలదీకరణం చెందుతాయి. శాస్త్రవేత్తలు ఇలాంటి అండాలతోనే ప్రయోగం నిర్వహించారు. సాల్మన్ అండాలపై 'ఇన్`విట్రో' పద్ధతిలో ట్రౌట్, సాల్మన్‌ల వీర్య కణాలను కలగలిపి ప్రయోగించారు. ట్రౌట్ అండంపై కూడా ఇదే విధంగా ప్రయోగం చేశారు. ఈ రెండు ప్రయోగాల్లోను ఆయా అండాలు తమ సొంత జాతికి చెందిన వీర్యకణాలనే ఎంపిక చేసుకుని ఫలదీకరణం చెందాయట. ఇలా కలగలిపి కాకుండా వేరు వేరుగా ప్రయోగిస్తే విజాతి వీర్యకణంతోనైనా ఇవి ఫలదీకరణం చెందాయట. దీన్ని బట్టి సాల్మన్ జాతికి చెందిన స్త్రీ చేపలు ఇతర జాతికి చెందిన చేపల వీర్యకణాలను స్వాగతించాయని, ఎంపిక చేసుకునే అవకాశం వస్తే మాత్రం తమ జాతికి చెందిన వీర్యకణాలనే ఎంపిక చేసుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఇలాంటి ఎంపికలో అండాలపై ఉండే అండాశయ ద్రవం కీలక పాత్ర పోషిస్తున్నట్టు శాస్త్రవేత్తలు ఈ పరిశోధనల ద్వారా గుర్తించారు.