: దృష్టిదోషాలు పెరుగుతున్నాయి


గత పదేళ్ల కాలంలో దృష్టి దోషాలు మరింతగా పెరిగాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం కూడా దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తడానికి కారణమవుతున్నాయిని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నిజానికి దృష్టి సంబంధిత సమస్యలు విటమిన్‌ లోపం వల్లగానీ, వయసు మీదపడడం వల్లగానీ సంభవిస్తుంటాయి. అయితే వీటికితోడుగా ఇప్పుడు స్మార్ట్‌ ఫోన్‌ వల్ల కూడా దృష్టి దోషం కలిగే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లండన్‌కు చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డేవిడ్‌ అలాంబీ నిర్వహించిన ఒక పరిశోధనలో దృష్టి సమస్యలకు స్మార్ట్‌ ఫోన్లు కూడా కారణమవుతున్నాయని తేలింది. ముఖ్యంగా ఏడేళ్లకన్నా తక్కువ వయసున్న చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లను ఇవ్వడం వల్ల వారికి ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని అలాంబీ హెచ్చరిస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్లు 1997లో ప్రారంభమయ్యాయి. అప్పటినుండి ఇప్పటి వరకూ దృష్టికి సంబంధించి ముఖ్యంగా హ్రస్వ దృష్టి సమస్యలు 35 శాతం పెరిగాయని అలాంబీ చెబుతున్నారు. వచ్చే పదేళ్లలో హ్రస్వ దృష్టి సమస్యలు యువతలోను, చిన్నారుల్లోను మరింతగా పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరిస్తున్నారు. చిన్నారుల్లో దృష్టి సమస్యలు 50 శాతం పెరిగే అవకాశముందని ఈ ధోరణి ఇలాగే సాగితే దృష్టి లోపానికి కూడా దారితీసే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. సాధారణంగా కంటికి సుమారు 40 సెంటీమీటర్ల దూరంలో పత్రికను ఉంచి చదువుతామని, అయితే ఫోను మాట్లాడే సమయంలో కంటికి కేవలం 18 నుండి 30 సెంటీమీటర్ల దగ్గరగా ఉండడం వల్ల ఈ సమస్య తలెత్తుతోందని అలాంబీ పరిశోధనలో వెల్లడైనట్టు డెయిలీ ఎక్స్‌ప్రెస్‌ తెలిపింది. ప్రస్తుత తరం చిన్న పిల్లలకు హ్రస్వదృష్టి దోషం ముప్పు పొంచి ఉందని, కాబట్టి చిన్న పిల్లలకు స్మార్ట్‌ ఫోన్లను ఇచ్చేటప్పుడు తల్లిదండ్రులు కాస్త ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అలాంబీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News