: జేపీకో న్యాయం.. వీహెచ్ కో న్యాయమా?: టీడీపీ ధ్వజం
తిరుపతిలో శనివారం వీహెచ్ పై దాడి ఘటనపై టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, వీహెచ్ పై దాడి జరిగిన కొద్ది సేపటికే ముగ్గురిని అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వకుండా రిమాండ్ కు తరలించారని ఆరోపించారు. అదే, అసెంబ్లీలో కూకట్ పల్లి ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణపై దాడి జరిగితే ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. గతంలో చంద్రబాబు కాన్వాయ్ పై దాడి చేస్తే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.
ఢిల్లీలో ఎవరో చనిపోతే ఏపీభవన్లో దళిత అధికారిపై హరీశ్ రావు చేయిచేసుకున్నా అరెస్టు చేయలేదని విమర్శించారు. అదేవిధంగా లగడపాటి, పరకాల ప్రభాకర్ లపై దాడి జరిగినా దిక్కులేదన్నారు. ఇక, టీడీపీలో ఉన్నప్పుడు నాగం జనార్థనరెడ్డిపై ఓయూలో దాడి జరిగిందని, అప్పుడూ ఇలాగే వ్యవహరించారని ముద్దుకృష్ణమనాయుడు మండిపడ్డారు. ఇప్పుడు వీహెచ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు గనుకనే తిరుమల టూటౌన్లో ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారని వివరించారు.