: అన్నా హజారేపై కేసు
జాతీయ పతాకాన్ని అవమానించారనే ఆరోపణల నేపథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారేపై కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని జాన్ పూర్ కోర్టు పోలీసులను ఆదేశించింది. గతనెల 29న అన్నా హజారే జాన్ పూర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అన్నా హజారే జాతీయ జెండాను అవమానించారని, ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాలని కోరుతూ స్థానిక లాయర్ శ్రీవాస్తవ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ రోజు హజారే జనతంత్ర యాత్రలో భాగంగా వాహనంపై జాన్ పూర్ వచ్చారని, దానిపై జాతీయ జెండా పెద్ద సైజులో పెయింటింగ్ వేసి ఉందని పేర్కొన్నారు. అక్కడ జరిగిన సభ రాత్రి ఎనిమిదింటి వరకు జరిగిందని, అప్పటి వరకు ఆ వాహనంపై పతాకం పెయింటింగ్ అలాగే ఉందని, ఇది జాతీయ పతాకాన్ని అగౌరవించడమేనని శ్రీవాస్తవ పిటిషన్ లో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని స్థానిక జడ్జి పోలీసులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం జాతీయ జెండాను సూర్యోదయం తర్వాత ఎగురవేసి, సూర్యాస్తమయం కాకముందే అవనతం చేయాలి.