: చిల్లమల్లరగా కోటి పోగేశాడు


చిల్లరేకదా... అని చిన్నచూపు చూడకండి... అలాంటి చిల్లరతోనే బగారోజో కోట్లకు పడగలెత్తాడు. అదికూడా మనం చిన్నచూపు చూసే చిల్లరను దొంగతనం చేయడంతోనే! పోలీసులకు చిక్కాక ఈ చిల్లర దొంగతనం గురించి బయటికి వచ్చింది. దీంతో ఆశ్యర్యపోవడం అధికారుల వంతయింది.

బగారోజో ఒక మామూలు మెకానిక్‌. అమెరికాలో పార్కింగ్‌ స్థలాల్లో మనలాగా మనుషులు కాకుండా అక్కడ కొన్ని మెషిన్లు ఉంటాయి. తమ వాహనాలను పార్కింగ్‌ చేసిన వారు తిరిగి వాహనాలను తీసుకుని వెళ్లే సమయంలో డబ్బులను అక్కడే ఉన్న మెషిన్లలో వేసిపోతుంటారు. వాటిలో మరమ్మత్తులు చేయాల్సి వస్తే బగారోజో లాంటి మెకానిక్‌లు వచ్చి వాటికి రిపేరు చేస్తుంటారు. ఇలా రిపేరు చేస్తున్న బగారోజో ఒకసారి యంత్రాన్ని గట్టిగా కొట్టాడు. దీంతో 25 సెంట్ల చిల్లర నాణేలు బయటికి వచ్చాయి. వాటిని జేబులో వేసుకున్న తర్వాత ఇక రోజూ ఇలా యంత్రాలను కొట్టడం ప్రారంభించాడు. రోజుకు సుమారుగా 75 పార్కింగ్‌ యంత్రాలనుండి చిల్లర కొల్లగొట్టేవాడు.

ఇలా ఎనిమిదేళ్లుగా తన చిల్లర దొంగతనం సాగిస్తూ సేకరించిన చిల్లరను తన ఇంటికి చేరవేశాడు. ఎంతమొత్తం అంటే 2,10,000 డాలర్లు. అంటే మన రూపాయల్లో సుమారుగా 1.29 కోట్లు. ఇలా చిల్లర పోగేసిన బగారోజో దాన్ని బ్యాంకులో ఇచ్చి మామూలు కరెన్సీ నోట్లుగా మార్చుకునేవాడు. చివరికి పోలీసులకు చిక్కిన తర్వాత ఇదంతా ఎందుకు చేశావని అధికారులు ప్రశ్నిస్తే తన సొంతింటికోసమని బగారోజో చెబుతున్నాడు. అయితే ఇదంతా అతను కేసినో (జూదం)లో వినియోగించాడని తేలడంతో బఫెలో న్యాయమూర్తి అతనికి రెండున్నరేళ్ల కారాగారవాస శిక్షను విధించారు. ఇలా చిల్లర దొంగతనంలో తన సహచరులకు కూడా బగారోజో ఆదర్శంగా మారాడని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News