: నాది తెలంగాణ కాదు, నాపై ఎవరూ దాడిచేయలేదు: డాక్టర్ పద్మావతి
కాకినాడలో నిరాహార దీక్ష చేసిన మంత్రి తోట నర్సింహం సతీమణి వాణి ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు వెళ్ళిన తూర్పుగోదావరి జిల్లా డీఎంహెచ్ వో డాక్టర్ పద్మావతి తెలంగాణకు చెందిన వ్యక్తని.. అందుకే సమైక్యవాదులు ఆమెపై పేడ విసిరి దాడిచేశారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. సాక్షాత్తూ టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ముఖ్యనేత హరీశ్ రావు తదితరులు ఈ విషయమై తీవ్రస్థాయిలో స్పందించారు. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, డాక్టర్ పద్మావతి వాస్తవానికి తెలంగాణకు చెందిన వ్యక్తి కాదు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా మీడియాతో వెల్లడించారు. తాను వార్తల్లో వ్యక్తి కావడం పట్ల ఆమె స్పందిస్తూ, గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ తన స్వస్థలం అని తెలిపారు. తనపై ఎవరూ దాడిచేయలేదని, ఆవేశంలో జరిగిన చిన్నపాటి చర్యగా కొట్టిపారేశారు. ఇలాంటి వివాదాల్లోకి తనను లాగవద్దని విజ్ఞప్తి చేశారు.