: ధోనీ సక్సెస్ చూసి కుళ్ళుకుంటున్నారు: అజయ్ జడేజా
టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీపై వెటరన్ క్రికెటర్ అజయ్ జడేజా (42) ప్రశంసల వర్షం కురిపించాడు. ధోనీ విజయపరంపరను చూసి కొందరు ఈర్ష్య పడుతున్నారని అన్నాడు. బుచ్చిబాబు క్రికెట్ టోర్నీలో హర్యానాకు కెప్టెన్సీ వహిస్తున్న జడేజా నిన్న చెన్నైలో హైదరాబాద్ తో మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడాడు. ధోని స్వభావమే అతనికి శ్రీరామరక్ష అని అభిప్రాయపడ్డాడు. ఒత్తిడిలో సైతం నిబ్బరంగా ఉండగలగడం అతడికే సాధ్యమన్నాడు. కొందరు ధోనీకి ఆట పట్ల నిశితదృష్టి లేదని విమర్శిస్తారని, వాళ్ళందరూ అతడి సక్సెస్ చూసి కుళ్ళుకునే వాళ్ళేనని అభిప్రాయపడ్డాడు. కేవలం ఆత్మశక్తితోనే వరుస విజయాలు సాధించలేరన్న విషయాన్ని అతడి విమర్శకులు గుర్తెరగాలని జడేజా హితవు పలికాడు. కాగా, నిన్న చెన్నైలో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో జడేజా 37 పరుగులు చేయడమే కాకుండా, జట్టును విజయపథంలో నడిపించాడు.