: కాచుకోండి.. పెట్రోల్, డీజిల్ వాతలకు!
తీవ్ర ప్రతికూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరల పిడుగు పడనుంది. మరోసారి పెట్రోల్ ధర పెరగడానికి సిద్ధంగా ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధర 108 డాలర్లకు పైగా చేరుకోవడం, రూపాయి విలువ క్షీణించడం (రూపాయిని డాలర్లలోకి మార్చుకునే దిగుమతులకు వెచ్చించాల్సి ఉంటుంది) వల్ల లీటర్ పెట్రోల్ ధరను రూపాయి మేర పెంచే అవకాశం ఉంది. అలాగే ఈ నెల చివర్లో లీటర్ డీజిల్ పై ఎలాగూ 50 పైసలు పెరుగుతుంది. కానీ, ఇటీవలి కాలంలో డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోయినందున నష్టాలను తట్టుకునేందుకు ఏక మొత్తంలో లీటర్ డీజిల్ పై 2 నుంచి 3 రూపాయలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ఆయిల్ కంపెనీలు కోరుతున్నాయి.
ప్రభుత్వం లీటర్ డీజిల్ పై నెలనెలా 50 పైసలు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చిందని, రూపాయి పతనంతో ఈ పెంపు వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థ డైరెక్టర్ ఒకరు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏకమొత్తంగా 3 రూపాయల వరకూ పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని తెలిపారు. అయితే రానున్న రోజుల్లో రూపాయి విలువ 65 -70 వరకు పడిపోయే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం లేకపోలేదు.