: విజయమ్మ దీక్ష ప్రజలను మోసగించడమే: సోమిరెడ్డి
సమైక్యాంధ్ర కోసం దీక్ష చేపట్టనున్న వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ గురించి పుల్లూరు సభలో ఏమి మాట్లాడారో విజయమ్మ ఓసారి గుర్తు తెచ్చుకోవాలని సూచించారు. అంతేగాకుండా, టీఆర్ఎస్ పుట్టకముందే తెలంగాణ చిచ్చు రగిల్చింది ఎవరో విజయమ్మ చెప్పాలని డిమాండ్ చేశారు. 1999లోనే వైఎస్ తెలంగాణ కోసమని నేతలతో సంతకాలు సేకరించారని, ఇది చూసి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పురుడు పోసుకుందని సోమిరెడ్డి వెల్లడించారు. ఇప్పుడు విజయమ్మ సమైక్యాంధ్ర కోసం దీక్ష అనడం ప్రజలను మోసగించడమే అని దుయ్యబట్టారు.
ఇక సీమాంధ్ర కేంద్ర మంత్రులపైనా ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నిన్న ఢిల్లీ వార్ రూమ్ లో అస్త్ర సన్యాసం చేశారని విమర్శించారు. 5 కోట్ల మంది ప్రజల అభిప్రాయాలను అధిష్ఠానానికి చెప్పే ధైర్యం వారికి లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం తగలబడి పోతూ ఉంటే వారు పదవుల కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. పనిలోపనిగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల నేత దిగ్విజయ్ సింగ్ పై విమర్శలు చేశారు. సొంత రాష్ట్రంలోనే ఆదరణ కరవైన వ్యక్తికి విభజన పెత్తనం ఎలా ఇస్తారని నిలదీశారు. దిగ్విజయ్ కు మధ్యప్రదేశ్ లో నిర్వహించిన ఓ సర్వేలో కేవలం 3 శాతం ఆదరణే లభించిందని వివరించారు.