: కృష్ణా, గోదావరి జలాల పంపకాలపై ఆందోళన వద్దు: డీఎస్


పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో తీవ్ర నిరసన జ్వాలలు పెల్లుబకడం పట్ల స్పందించారు. హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పలు అంశాలపై అభిప్రాయాలు వెల్లడించారు. ముఖ్యంగా కృష్ణా, గోదావరి నదీ జలాల పంపకాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాటి పంపిణీకి చట్టబద్ధమైన సంస్థలున్నాయని తెలిపారు. నీటివనరుల విషయమై ఇతర రాష్ట్రాలతో ఎలాంటి ఒప్పందాలు, సంబంధాలు ఏర్పరుచుకున్నామో, సీమాంధ్ర-తెలంగాణ మధ్య అలాంటి సంబంధాలే ఉంటాయని పేర్కొన్నారు.

ఇక, తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందని కాంగ్రెస్, యూపీఏ ఇప్పటికే స్పష్టం చేశాయన్నారు. దీన్నిబట్టి ఇక నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదన్న విషయం అర్థమవుతోందన్నారు. తెలుగు ప్రజల మధ్య ఉన్న ప్రేమాభిమానాలు గత 15 రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయని, ఇది విచారించాల్సిన విషయమన్నారు. రాష్ట్రం విడిపోయినా జాతిగా కలిసుందామని పిలుపునిచ్చారు. సీమాంధ్రలో ఏపీఎన్జీవోలు సమ్మె చేస్తుండడం పట్ల మాట్లాడుతూ, ఉద్యోగుల్లో కొన్ని అపోహలు నెలకొన్నాయని, అందుకే ఈ నిరసనలని తెలిపారు.

  • Loading...

More Telugu News