: క్యాన్సరును ముందే పసిగట్టొచ్చు
క్యాన్సరు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకునేకన్నా కూడా ఈ వ్యాధిని ముందుగానే పసిగడితే అప్పుడు చికిత్స మరింత మెరుగ్గా ఉంటుంది. ఈ విషయంలో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు కొన్ని ప్రత్యేక జన్యు సంకేతాలను గమనించడం ద్వారా పలు రకాల క్యాన్సరు వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చని చెబుతున్నారు.
వెల్కం ట్రస్ట్ సాంగర్ ఇన్స్టిట్యూట్కు చెందిన శాస్త్రవేత్తలు మనుషుల్లో తరచుగా కనిపించే 30 రకాల క్యాన్సర్ వ్యాధులకు సంబంధించిన మూలాలను గుర్తించారు. డీఎన్ఏ మార్పుల వల్ల ఏర్పడే జన్యు సంకేతాలను పసిగట్టడం ద్వారా శాస్త్రవేత్తలు దీన్ని సాధించారు. ఈ జన్యు సంకేతాలను గుర్తించడం వల్ల పలు రకాల క్యాన్సరు వ్యాధులకు చికిత్సకు, అలాగే వాటి నివారణకు ఈ పరిజ్ఞానం చక్కగా తోడ్పడగలదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
ఒక్కో డీఎన్ఏ పరివర్తిత ప్రక్రియ జన్యువుల్లో ప్రత్యేకమైన ముద్ర లేదా సంకేతాన్ని ఏర్పరుస్తుంది. అందుకే వివిధ క్యాన్సరు వ్యాధుల బారినపడినవారికి సంబంధించిన 7,042 జన్యు క్రమాలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ పరిశీలనలో క్యాన్సరు వ్యాధికి దారితీసే 20 రకాల జన్యు సంకేతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విషయం గురించి లుడ్మిల్ అలెగ్జాండ్రోవ్ మాట్లాడుతూ క్యాన్సరు జన్యుక్రమం మీద ఇలాంటి మార్పులను కలుగజేసే సంక్లిష్టమైన జీవ ప్రక్రియలను అర్థం చేసుకోవాలని ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.