: అప్పుడు ఎర్రన్నాయుడు.. ఇప్పుడు లాల్ జాన్ బాషా
టీడీపీ సీనియర్ నేతలు ప్రమాదాల కారణంగా అసువులు బాయడం నిజంగా విచారించదగ్గ విషయం. టీడీపీలో దళిత నేతగా ఎదిగిన జీఎంసీ బాలయోగి, ఉత్తరాంధ్రలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కింజరాపు ఎర్రన్నాయుడు, మైనారిటీ నాయకుడు లాల్ జాన్ బాషా.. వీరందరూ అర్థాంతరంగా తనువు చాలించినవారే. లోక్ సభకు స్పీకర్ గా ఎన్నికైన తొలి దళితుడిగా రికార్డులకెక్కిన బాలయోగి ఓ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు.
2002 మార్చి 3న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నుంచి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపంతో కుప్పకూలింది. కృష్ణా జిల్లా కువ్వడలంక వద్ద ఓ కొబ్బరిచెట్టుకు తగిలిన ఆ చాపర్ సమీపంలోని చేపల చెరువులో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో బాలయోగి అక్కడిక్కడే మరణించారు.
ఇక, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీకి అండదండగా నిలిచే ఆజానుబాహుడు కింజరాపు ఎర్రన్నాయుడు కూడా అకస్మికంగా మృతి చెంది పార్టీ వర్గాలను తీరని విషాదంలో ముంచెత్తారు. గతేడాది నవంబర్ 2న విశాఖలో ఓ వివాహానికి హాజరై తిరిగి శ్రీకాకుళం వస్తూ, రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఓ ట్యాంకర్ ను ఢీకొనడంతో ఆయన ప్రాణాలు విడిచారు. ఘటన అనంతరం కాసేపు ప్రాణాలతో ఉన్న ఎర్రన్నాయుడు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.
ఇక నేటి ఉదయం గుంటూరుకు చెందిన లాల్ జాన్ బాషా తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. మరో వాహనం ఢీకొట్టడంతో ఈయన ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. దీంతో, బాషా అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో, అధినాయకత్వంతోపాటు పార్టీ శ్రేణులు తీవ్ర విచారంలో మునిగిపోయాయి. పార్టీలకతీతంగా బాషా మృతికి సంతాపం తెలియజేశారు.