: ఇనుము వ్యాపారం నుంచి టీడీపీ ఉపాధ్యక్షుడి దాకా..
గుంటూరులో ఎక్కడో ఇనుము వ్యాపారం చేసుకునే వ్యక్తి, ఎన్టీఆర్ వంటి మహానుభావుడి అనుగ్రహం సంపాదించడం మామూలు విషయమా? కానేకాదు. తెలుగుదేశం పుట్టుక నుంచి పార్టీ కోసమే పనిచేస్తూ అవకాశవాద రాజకీయనేతలకు అందనంత ఎత్తులో నిలవడమూ సాధారణ వ్యవహారం కాదు. కానీ, లాల్ జాన్ బాషా దీన్ని సుసాధ్యం చేశారు. నమ్మిన విలువలకు కట్టుబడి ఉంటూ టీడీపీలో ఓ మామూలు కార్యకర్త నుంచి ఉపాధ్యక్షుడి దాకా ఎదగడం ఆయనకే చెల్లింది. గుంటూరు మిర్చి ఎంతో ఘాటో.. అక్కడి రాజకీయాలూ అంతే హాటు. అలాంటి వాడివేడి రాజకీయ ప్రాంగణంలో టీడీపీ జెండాను రెపరెపలాడించేందుకు బాషా చివరివరకూ అలుపెరుగని పోరాటం సాగించారు.
1991లో గుంటూరు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి విజయభేరి మోగించారు. గుంటూరు లోక్ సభ స్థానంలో టీడీపీ గెలవడం అదే మొదటిసారి. విశేషమేమిటంటే, బాషా గెలిచింది ఎవరో అనామకుడిపై కాదు, సుప్రసిద్ధ నేత ఎన్జీరంగాపై. దీంతో, ఆయన పేరు మార్మోగిపోయింది. పార్టీలోనూ గౌరవాభిమానులు మెండుగా సంపాదించుకున్నారు. అనంతరం 1996, 98లో రాయపాటి సాంబశివరావు చేతిలోనూ, 1999లో నరసరావుపేట స్థానానికి పోటీచేసి మాజీ సీఎం ఎన్.జనార్ధనరెడ్డి చేతిలోనూ ఓటమిపాలయ్యారు.
అయితే, సమర్థుడైన నేతను ఎవరూ విస్మరించజాలరు. ఈ విషయం బాబుకు తెలియందికాదు. అందుకే ఆయనను 2002లో రాజ్యసభకు పంపారు. 2008 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన బాషా ఆ తర్వాత టీడీపీ ఉపాధ్యక్షుడిగా సరికొత్త ఇన్నింగ్స్ ఆరంభించారు. పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగానూ బాధ్యతలు స్వీకరించారు. పార్టీ ఎప్పుడు ఒడిదుడుకుల్లో పడినా నేనున్నాంటూ ముందుకొచ్చే నేతల్లో బాషా ఒకరు.
ఎన్టీఆర్ హయాంలో ఓసారి పార్టీ పరిస్థితి దిగజారిపోతున్న తరుణంలో.. బాబును పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదించి తన ముందుచూపును చాటుకున్నారు. ఆ సమయంలో బాబుకు అండగా నిలిచి ఆయన అభిమానానికి పాత్రుడయ్యారు. కానీ, విధి బలీయమైనది. ఆయన ప్రాణాలకు లేశమాత్రం విలువివ్వకుండా నిర్దయగా బలిదీసుకుంది. తద్వారా టీడీపీ శ్రేణుల విషాదానికి కారణమైంది.