: దేశ ప్రజలకు ప్రధాని స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. పేదరిక నిర్మూలన కోసం, యువతకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని, గత తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని చెప్పారు. పేదలకు ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతోనే ఆహార భద్రత బిల్లును తీసుకొచ్చినట్లు వెల్లడించారు. అయితే, చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్నారు.
దేశంపై ఆర్థిక మాంద్యం ప్రభావం అధికంగా ఉందని చెప్పారు. అలాగే పాకిస్థాన్ తో సంబంధాలు ఇబ్బందికరంగా ఉన్నాయన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లోనూ, సింధురక్షక్ జలాంతర్గామి ప్రమాదంలోనూ మరణించిన వారికి ప్రధాని సంతాపం తెలిపారు.
అంతకుముందు ప్రధాని బాపూ ఘాట్ కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని జెండాను ఆవిష్కరించారు. ప్రస్తుత పదవీ కాలంలో ఎర్రకోటపై ప్రధానిగా మన్మోహన్ కు ఇదే చివరి స్వాతంత్ర్య ప్రసంగం కానుంది. వచ్చే ఏడాది జూన్ లో కొత్త ప్రభుత్వం కొలువు దీరనున్న సంగతి తెలిసిందే.