: అధిష్ఠానాన్ని ధిక్కరించిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు


సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు అధిష్ఠానాన్ని తొలిసారి ధిక్కరించారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తరువాత తొలిసారి వీరు అధిష్ఠానం ఆజ్ఞలను తుంగలో తొక్కారు. ఆహార భద్రత బిల్లుపై జరిగే చర్చలో తప్పనిసరిగా పాల్గొనాలని, ఆ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. దాన్ని సైతం కాదని సమావేశాలు జరుగుతుండగా బయటకు వచ్చేశారు సీమాంధ్ర ఎంపీలు. ఈ మధ్య కాలంలో అధిష్ఠానం పెద్దలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ధిక్కరించిన దాఖలాలు లేవు. కానీ తాజాగా ఆజ్ఞల ఉల్లంఘన ద్వారా తమ అభీష్టమేమిటో అధిష్ఠానం పెద్దలకు చెప్పకనే చెప్పారు సీమాంధ్ర ఎంపీలు.

ఇటీవలి కాలంలో సీమాంధ్ర ఎంపీలు అధిష్ఠానం నిర్ణయాన్ని సమర్ధిస్తున్నట్టు కనిపించారు. కానీ సీమాంధ్రలో ఉద్యమం తీవ్రత పెరిగిన కారణంగా ఆ ప్రాంత ఎంపీలు అధిష్ఠానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తమ చర్య ద్వారా తెలిపారు. ప్రజాభీష్టం మేరకు ఎంపీ పదవులకు రాజీనామాలు చేసినప్పటికీ పార్లమెంటుకు వెళ్లి వస్తూ అధిష్ఠానానికి తమ విశ్వసనీయతను చాటుకున్నారు. ఆహారభద్రత బిల్లుకు అనుకూలంగా ఉంటామని కూడా తెలిపారు. చివరకు వ్యూహం మార్చుకుని సీమాంధ్ర ఎంపీలంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుని సభ నుంచి బయటకు వచ్చేశారు. వీరి ప్రవర్తనపై కాంగ్రెస్ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News