: తప్పు నిరూపిస్తే పదవీత్యాగం చేస్తా: వీరప్ప మొయిలీ
రిలయన్స్ కు లబ్ది చేకూర్చేందుకే అధికారిని బదిలీ చేశామని నిరూపిస్తే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చమురు శాఖ మంత్రి వీరప్ప మొయిలీ ప్రకటించారు. సీపీఐ నేత గురుదాస్ దాస్ గుప్తా ఆరోపిస్తున్నట్టుగా, తన శాఖలో జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న గిరిధర్ అరమానెను బదిలీ చేయలేదని మొయిలీ తెలిపారు. 1988 బ్యాచ్ కు చెందిన ఈ ఐఏఎస్ అధికారిని జైపాల్ రెడ్డి హయాంలో ఇక్కడ నియమించారన్నారు. ఇప్పటికీ ఆయన అదే హోదాలో కొనసాగుతున్నారని, కాకుంటే, అతను నిర్వర్తిస్తున్న కొన్ని విధులను మరో జాయింట్ సెక్రటరీకి అప్పగిస్తున్నామని మెయిలీ తెలిపారు. రిలయన్స్ తో సంబంధం ఉన్న ఎక్స్ ప్లోరేషన్ విభాగం ఇప్పటికీ అరమానె ఆధ్వర్యంలోనే ఉందని స్పష్టం చేశారు.