: కేంద్ర ప్రభుత్వానికి వెంకయ్య నాయుడి సూటి ప్రశ్న
రాష్ట్ర విభజన ఎంతో సున్నితమైన అంశమని దాన్ని గుర్తించకుండా ఎందుకు రాజకీయం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ నిర్ణయం తీసుకోవాల్సింది మహాత్మా గాంధీ కాదంటూ.. అలాంటప్పుడు సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు గాంధీ బొమ్మ దగ్గర నిరసనలు తెలపడమేంటని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు కానీ, సోనియా గాంధీ ఇంటి ముందు కానీ ధర్నా చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రకటన అనంతరం తెలంగాణలో ఔట్లు పేల్చి సంబరాలు చేసుకున్నది కాంగ్రెస్ పార్టీ నేతలేనన్నారు. పార్టీలన్నీ తెలంగాణకు అనుకూలం అన్నాయి కనుక, తాముకూడా అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించామంటూ చిదంబరం చెప్పడాన్ని వెంకయ్య తప్పుపట్టారు.
అందుకే ముందుగా కాంగ్రెస్ పార్టీ తన అధికారిక విధానం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవైపు సుదీర్ఘంగా చర్చలు జరిగాయని చిదంబరం చెబుతుంటే ఎంపీలు, ప్రజాప్రతినిధులు చర్చ జరగలేదని ఆందోళనలు జరుపుతున్నారని ఇందులో ఎవరు అబద్దాలు ఆడుతున్నట్టని ప్రశ్నించారు. ప్రజల్ని శాసనసభ్యులు మభ్యపెడుతున్నారా? లేక పార్లమెంటును చిదంబరం తప్పుదోవ పట్టిస్తున్నాడా? అని ప్రశ్నించారు. ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం తామే ఇచ్చామని సంబరాలు చేసుకుంటున్నారని, మరోవైపు అన్ని పార్టీలు లేఖలు ఇచ్చి సుముఖం అని తెలిపిన తరువాత చివరగా మేం ఒప్పుకున్నామని చిదంబరం చెప్పడాన్ని ఖండించారు.
'అసలు విభజనపై సుధీర్ఘంగా చర్చలు ఎవరితో జరిపారు.. ఎప్పుడు జరిపారు.. పోనీ మీ పార్టీలోనైనా అంతర్గతంగా చర్చిస్తే ఆ వివరాలు వెల్లడించండి' అని వెంకయ్య డిమాండ్ చేశారు. అంత సుదీర్ఘంగా చర్చించినప్పుడు ఆంటోనీ కమిటీ ఎందుకు వేశారని సూటిగా అడిగేశారు. చివరగా చిదంబరం కొన్ని పార్టీలు నిర్ణయం మార్చుకున్నాయని, అది తప్పుకాదని అన్నారని గుర్తు చేశారు. అంటే, కాంగ్రెస్ పార్టీ మళ్లీ యూటర్న్ కు రెడీ అయిందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకెళ్లి మాట్లాడేటప్పుడు 'మాకు సంకేతాలు వెలువడ్డాయి, ప్రక్రియ ఆగిపోయింది' అని అంటారని మండిపడ్డారు.
అసలు కాంగ్రెస్ దృష్టిలో ప్రక్రియ అంటే ఏమిటి? అని అడిగారు. 'ప్ర' అంటే ఎన్నికల వరకు సాగదీయడమా? అంటూ.. ఎన్నికల తరువాత కొత్త ప్రభుత్వం 'క్రియ' ఆరంభిస్తుందా? అని ప్రశ్నించారు. అసలు ఇంతకీ మీ ప్రకటన వెనుకనున్న మర్మమేమిటి మహాశయా? అని చిదంబరాన్ని వెంకయ్యనాయుడు సూటిగా ప్రశ్నించారు.