: రాష్ట్రం కోసం నా వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశా: చంద్రబాబు


రాష్ట్ర ప్రగతి కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేశానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంటులో జరిగిన చర్చలో రాష్ట్రానికి సంబంధం లేని పార్టీలన్నీ పాల్గొన్నాయని తెలిపారు. నిన్న సభలో జరిగిన చర్చ చూస్తుంటే అసలు చిదంబరం శ్రీకృష్ణ కమిటీ నివేదిక చదివాడా..? అన్న అనుమానం కలుగుతుందని అన్నారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయండని పార్లమెంటులో వారం రోజులుగా టీడీపీ ఎంపీలు పోరాడుతుంటే.. కాంగ్రెస్ నేతలు ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీడబ్ల్యూసీలో నిర్ణయం తీసుకున్నామని ఒకవైపు చెబుతూ, మరోవైపు దిగ్విజయ్ సింగ్, కేసీఆర్ కు విలీన ప్రతిపాదన చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలు ఇంత దుర్మార్గంగా మారాయని అన్నారు. ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే 14 సీట్లొస్తాయని దిగ్విజయ్ చెప్పడాన్ని బాబు తప్పుబట్టారు. తెలంగాణ ఏర్పాటుపై టీడీపీ స్పష్టమైన వైఖరి వెల్లడిస్తుంటే, తమ పార్టీకి అవగాహన లేదంటూ ఆరోపణలు చేస్తారని విమర్శించారు. హైదరాబాద్ ప్రజల భద్రతపై సమాధానం చెప్పకుండా మిగిలినవన్నీ మాట్లాడతాడని డిగ్గీ రాజాపై మండిపడ్డారు.

దిగ్విజయ్ సింగ్ లాంటి వ్యక్తి ఉదయం ఒకలా, సాయంత్రం మరొకలా, రాత్రి ఇంకొకలా మాట్లాడడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన రాష్ట్రాల విభజన ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ను విభజిస్తామని చిదంబరం అంటున్నారని.. కానీ, ఇక్కడ అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. 'అక్కడ ప్రజలు తామే విడిపోతామన్నారు. వారు కొత్త రాజధాని నిర్మించుకుంటామని వెళ్లిపోయారు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు' అని తెలిపారు. దిగ్విజయ్ కొత్త రాజధాని ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచపటంలో స్థానం కల్పించామని బాబు ఈ సందర్భంగా గర్వంగా చెప్పారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ చాటి చెబితే, తెలుగువారి ఆత్మవిశ్వాసాన్ని తాను పెంచానని స్పష్టం చేశారు. రాజధాని కనుకనే హైదరాబాద్ లో ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ యూనివర్సిటీ, సైబరాబాద్ సిటీ, ఎకనమిక్ మాన్యుమెంట్స్ ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్ ఆర్ధికంగా బాగుపడడానికి బయో, ఫార్మా, ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అథారిటీ సెంటర్ అన్నీ పెట్టించామన్నారు. కాలేజీలు పెట్టడమే కాకుండా విద్యకు ప్రాధాన్యమిచ్చామని చెప్పుకొచ్చారు.

బిట్స్ పిలానీలో మనదే అగ్రస్థానం. ఐఐటీలు, మెడికల్ కాలేజీల్లో మన విద్యార్థులు సీట్లు సంపాదిస్తున్నారంటే ఆ ఘనతెవరిదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కాలంలో సొంత ఇంటినో, సొంత ఊరినో అభివృద్ధి చేసుకోలేదని, రాష్ట్రాన్ని బాగుచేశానని అన్నారు. విమానాశ్రయం విషయంలో 5 వేల ఎకరాలు సమకూర్చామని తెలిపారు.

మైక్రోసాఫ్ట్ సంస్థను ఆంధ్రాకు రప్పించేందుకు అమెరికా మొత్తం తిరిగానన్నారు. తాను పడ్డ కష్టం మొత్తం తన కుటుంబం కోసం కాదని, రాష్ట్రం బాగుపడాలని చేశానన్నారు. రాజధాని ఉన్నవారు విభజన కోరడం ఎక్కడా లేదని తెలిపారు. విభజన ప్రకటన అనంతరం ఇక్కడికి దీటుగా అక్కడ అభివృద్ధి జరగాలని ఓ లెక్క చెబితే, అంతెందుకవుతుందని ఎద్దేవా చేస్తారా? అని ప్రశ్నించారు.

భవిష్యత్తేంటో తెలీక విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు అన్న విషయం అందరికీ తెలుసని, దాన్ని ఎవరో చెప్పాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు. చట్టం తీసుకొస్తాం, అందరికీ న్యాయం చేస్తాం అంటారు అది ఎలా చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉందాలేదా అని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి చెప్పాడు కాబట్టే విభజించామని చిదంబరం అంటే... రాజశేఖర్ రెడ్డి ఎప్పుడు చెప్పాడని కేవీపీ ఎదురు ప్రశ్నిస్తారని బాబు దుయ్యబట్టారు. ఒక పార్టీలోనే రెండు అభిప్రాయాలు ఎలా చెబుతారని ప్రశ్నించారు. మంచి మీ మీదికి, చెడు మా మీదికి ఎలా తోసేస్తారని ప్రశ్నించారు. మీరు తీసుకునే నిర్ణయంపై కనీసం మీ పార్టీ నేతలను కూడా ఒప్పించకుండా రోడ్ల మీదికి ఎలా వదిలారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News