: వరల్డ్ రికార్డు మిస్సయిన శిఖర్ ధావన్


దక్షిణాఫ్రికాలో జరుగుతున్న 'ఎ' జట్ల ముక్కోణపు టోర్నమెంటులో భారత యువకెరటం శిఖర్ ధావన్ ప్రపంచ రికార్డును మిస్సయ్యాడు. భారత్ ఎ-దక్షిణాఫ్రికా ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ధావన్ 150 బంతుల్లో 248 పరుగులు సాధించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును సాధించిన భారత క్రికెటర్ గా చరిత్ర పుటలకెక్కాడు. అయితే, ఈ ఢిల్లీ డైనమైట్ 20 పరుగుల తేడాతో ప్రపంచ రికార్డును సమం చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇప్పటివరకు 50 ఓవర్ల మ్యాచ్ లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇంగ్లండ్ కౌంటీ క్రికెటర్ అలీ బ్రౌన్ పేరిట ఉంది. బ్రౌన్ 2002లో సర్రే జట్టు తరుపున ఆడుతూ గ్లామోర్గాన్ పై 268 పరుగులు సాధించాడు.

కాగా, దక్షిణాఫ్రికా ఎ జట్టుతో మ్యాచ్ లో భారత్ 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. ధావన్ మెరుపులు, పుజారా (109 నాటౌట్) నిలకడ.. వెరసి భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 433 పరుగులు చేసింది. అయితే, సఫారీలు కూడా భారత్ భారీ స్కోరుకు దీటుగా స్పందించారు. జార్స్ వెల్డ్ (108), రీజా హెండ్రిక్స్ (102) చెలరేగడంతో భారత్ పరాజయం ఖాయమనే అనుకున్న దశలో ఈశ్వర్ బంతితో ఆకట్టుకున్నారు. 4 వికెట్లతో దక్షిణాఫ్రికా వీరులకు పగ్గాలు వేశాడు. దీంతో, ఆ జట్టు 48.2 ఓవర్లలో 394 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఫైనల్ చేరిన భారత్.. టైటిల్ కోసం ఆస్ట్రేలియా ఎ జట్టుతో రేపు తలపడనుంది.

  • Loading...

More Telugu News